ఇంటర్మీడియట్ విద్యార్థిని అనుమానాస్పద మృతి చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారింది. మైనర్ బాలిక మృతి అనేక అనుమానాలు కలిగిస్తుంటే, సోషల్ మీడియా వేదికగా మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. యువతి మృతి చెంది వారం గడుస్తున్నా ఈ కేసులో మిస్టరీ వీడలేదు.


చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం వేణుగోపాల్ పురానికి చెందిన మునికృష్ణ, పద్మల చివరి కుమార్తె భవ్యశ్రీ (16) పెనుమూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ నెల 16వ తారీఖున గ్రామంలో వినాయక చవితి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో పూలు కట్టేందులు వెళ్ళి వస్తానంటూ చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చిన భవ్యశ్రీ కనిపించక పోయింది. తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గ్రామస్తుల సహకారంతో చుట్టుపక్కల ప్రాంతాలను గాలించినా భవ్యశ్రీ ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 17వ తారీఖు సాయంత్రం పెనుమూరు పోలీసులకు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ఈ నెల 19వ తారీఖు సాయంత్రం భవ్యశ్రీ ఇంటికి సమీపంలోని ఓ పాడుబడిన బావిలో శవం తేలి ఆడుతూ కనిపించింది. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.


దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో నుండి యువతి మృత దేహాన్ని వెలికి తీయడంతో ఆ మృతదేహం భవ్యశ్రీగా గుర్తించారు. మృత దేహం నుంచి శాంపుల్ ను సేకరించి వాటిని ఆర్ఎఫ్ఎఫ్ఎస్ ల్యాబ్ పంపి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. బావిలో భవ్యశ్రీ తల శిరోముండం చేసినట్లుగా కనిపించడం, భవ్యశ్రీ ధరించిన లెగ్ హీల్స్ లేకపోవడం, కనురెప్పలను కత్తిరించి ఉండడం, నాలుక కొరికినట్లుగా ఉండడంతో భవ్యశ్రీ తల్లిదండ్రుల్లోనూ, స్థానికులలోనూ అనేక సందేహాలు, అనుమానాలు రేకెత్తుతున్నాయి.


ఆ నలుగురు యువకులను విచారిస్తున్న పోలీసులు


ఇంటర్ విద్యార్ధిని భవ్యశ్రీ(16) అనుమానాస్పద స్ధితిలో మృతి చెందిన ఘటనపై భవ్యశ్రీ తల్లిదండ్రులు ఆరోపించిన కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. యువతి కేసులో త్వరితగతిన పురోగతి సాగించేందుకు బావిలోని నీటి బయటకు తోడి ఆనవాళ్ళు కోసం గాలించడంతో యువతి వెంట్రుకలు లభ్యం అయ్యాయి. దీనిని ఆర్ఎఫ్ఎఫ్ఎస్ ల్యాబ్ కు పంపారు. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి వచ్చే రిపోర్ట్ ఆధారంగా పోలీసులు కేసు మరింత వేగవంతం చేయనున్నారు. అయితే ఈ కేసులో అనుమానితులైన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా కేసును చేధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  


భవ్యశ్రీకి న్యాయం చేయండంటూ ఆవేదన 


భవ్యశ్రీ చావుకు కారణంమైన వారిని ఉరి తీయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కక్షతోనే నలుగురు యువకులు అత్యాచారం చేసి, తలవెంట్రుకలు తొలగించి, ఆ తర్వాత భవ్యశ్రీని చంపి బావిలో పడేశారని, ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు తమకు అనుమానం ఉందని భవ్యశ్రీ తల్లి పద్మ ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయం మరో బిడ్డకు జరగకుండా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని భవ్యశ్రీ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.