Post Poll Violence in Andhra Pradesh | తిరుపతి: ఏపీలో ఎన్నికల ముందు, తరువాత హింసాత్మక ఘటనలు జరగడం తెలిసిందే. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద మే 14న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు. దాడి ఘటనలో సంబంధం లేని వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు చెప్పారు. సీసీ ఫుటేజ్ ని తిరుపతి ఎస్పీకి చెవిరెడ్డి అందజేశారు. వీడియో పరిశీలించి, ఆ దాడి ఘటనకు సంబంధం లేని వైసీపీ కార్యకర్తల్ని విడుదల చేయాలని ఎస్పీని కోరారు.
చంద్రగిరిలో పోలింగ్ రోజు నుంచే వివాదం
ఏపీలో పోలింగ్ సమయంలో పల్నాడు జిల్లాలో, తిరుపతి జిల్లాలో, అనంతపురం జిల్లాల్లో హింస చెలరేగింది. చంద్రగిరి నియోజకవర్గంలో బ్రహ్మణ కాలువ వద్ద టీడీపీ, వైసీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లోనే పరస్పరం దాడులు చేసుకున్నారు. రెండు పార్టీల శ్రేణులు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. కేంద్ర బలగాలు గాల్లోకి కాల్పులు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కూచివారిపల్లిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు మోహరించి పరస్పరం దాడులు చేసుకున్నారు. టీడీపీ నేతలు వైసీపీ సర్పంచ్ ఇంటిపై దాడి చేయడం అక్కడికి చేరుకున్న వైసీపీ అభ్యర్థిని.. టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టడంతో పాటు అతని గన్ మ్యాన్‌ను చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ నేత ఇంటితో పాటు అభ్యర్ది కారును టీడీపీ నేతలు దగ్థం చేశారు. టీడీపీ అభ్యర్థి వచ్చి గన్ మ్యాన్‌ను విడిపించి బయటకు పంపగా.. కేంద్ర బలగాలు చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశాయి.
ఈవీఎం తరలింపు సమయంలో దాడి
మే 14న తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ స్ర్టాంగ్ రూంకు ఈవీఎంలు తరలిస్తుండగా, పరిశీలించేందుకు తొలుత వైసీపీ అభ్యర్ది శ్రేణులతో అక్కడికి చేరుకున్నారు. అనంతరం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వర్సిటీ గేటు లోపలికి రాగానే.. వైసీపీ మద్దతుదారులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. పులివర్తి నానిని కాపాడే ప్రయత్నంలో గన్ మ్యాన్ గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో గన్‌మెన్‌కు, ఓ వైసీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని విధ్వంసం చేశారు. దీంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వైసీపీ కార్యకర్తలు పలువుర్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
నామినేషన్ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంపై దాడి చేసినందుకు తాము టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ప్రతిదాడి చేశామని దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భానుకుమార్ రెడ్డి సతీమణి, జడ్పీటీసీ ఢిల్లీ రాణి అన్నారు. అయితే ఆయనను చంపాలన్నది తమ ఉద్దేశం కాదని, అది కేవలం ప్రతిదాడి మాత్రమే నని స్పష్టం చేశారు. తిరుపతి ఆర్డిఓ ఆఫీసులో చెవిరెడ్డి నామినేషన్ వేయడానికి వస్తే ఆయన వాహనంపై టీడీపీ దాడి చేసిందని ఆరోపించారు. అందుకు తాము ప్రతిదాడి చేశాం, కానీ ఎవర్నీ చంపే ఉద్దేశం లేదన్నారు. కానీ పోలీసులు కేసులు నమోదు చేసి కేవలం వైసీపీ శ్రేణుల్ని అరెస్టులు చేశారని వారు ఆరోపిస్తున్నారు.