JEE Advanced 2024 Exam: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన 'జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2024' పరీక్ష నిర్వహణకు ఐఐటీ మద్రాస్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మే 26న నిర్వహించనున్న ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌‌లో పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో సెషన్‌‌లో పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఇప్పటికే అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. 


తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువగా.. 


గతంలో కంటే అత్యధిక సంఖ్యలో ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకోగా.. ఈసారి ఏకంగా 1.91 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఏపీ, తెలంగాణల నుంచి అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 45,965 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించగా.. 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్‌ను రెండు సెషన్లు కలిపి 14.10 లక్షల మంది పరీక్షలకు హాజరైన సంగతి తెలిసందే. వీరిలో క్వాలిఫై కటాఫ్‌ మార్కులు సాధించిన వారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. మొత్తం 2,50,284 మంది అభ్యర్థులు అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించగా.. మొత్తం 1.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 


జూన్‌ 9న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల వెల్లడి.. 


జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 ప్రవేశ పరీక్షను మే 26న నిర్వహిస్తుండగా.. మే 31న అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఇక జూన్ 2న ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసి, అభ్యర్థుల నుంచి జూన్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జూన్ 9న ఫైనల్ ఆన్సర్ కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ మరుసటి రోజునుంచే అంటే.. జూన్‌ 10 నుంచి జోసా తాత్కాలిక సీట్ల కేటాయింపు చేపడుతుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఎన్‌ఐటీల్లో దాదాపు 24వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్‌ ఐటీల్లో మరో 16వేల సీట్లను భర్తీచేయనున్నారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతోపాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. 


పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..


➥ జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2024 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందుగానే వారికి కేటాయించిన సెంటర్లకు చేరుకోవాలి. ఎందుకంటే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను లోపలకు అనుమతించరు. పరీక్షకు రెండు గంటల ముందుగానే కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం.


➥ పరీక్షకు హాజరయ్యేవారు తమతో పాటు అడ్మిట్‌ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఫొటో ఐడీ కార్డునూ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్‌కార్డు జిరాక్స్‌ కాపీని ఇన్విజిలేటర్లకు అందించి ఒరిజినల్‌ కాపీని తమ వద్దే ఉంచుకోవాలి.


➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ పాటించాల్సి ఉంటుంది. పెద్ద బటన్‌లు కలిగిన వస్త్రాలు, ఫుల్‌స్లీవ్‌ వస్త్రాలు ధరించకూడదు. బంగారపు ఆభరణాలు, జడలో పూలు ధరించకూడదు.


➥ బాల్‌పాయింట్‌ (బ్లూ/బ్లాక్) పెన్నును మాత్రమే వినియోగించాలి.


➥ పెన్సిల్, ఎరేజర్లను తెచ్చుకోవచ్చు. అలాగే, సాధారణమైన వాచీని ధరించవచ్చు.


➥  మొబైల్ ఫోన్లతోపాటు డిజిటల్‌ పరికరాలు, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతించరు.


➥ అభ్యర్థులు ట్రాన్స్‌పరెంట్‌ బాటిళ్లలో మాత్రమే తాగునీటిని తెచ్చుకోవాలి.


➥ అడ్మిట్‌కార్డులో నమోదు చేసిన పేరు, పేపర్, పుట్టిన తేదీ, జెండర్‌ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.


➥ పరీక్ష సమయం పూర్తయ్యాకే పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..