Blast at Chhattisgarh’s Explosives Factory: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. గన్‌పౌడర్ తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే...ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది మృతి చెందినట్టు ముందు ప్రచారం జరిగింది. అయితే...ఈ మృతుల సంఖ్య విషయంలో అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. బెమెతారా జిల్లాలోని పిర్దా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే అప్రమత్తమైన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులతో పాటు రెస్క్యూ టీమ్ చేరుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది కార్మికులున్నారు. ఈ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా అదిరి పడ్డాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..మొత్తం ఏడుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వాళ్లలో ఓ వ్యక్తి చికిత్స పొందుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. మిగతా ఆరుగురు బాధితులకు వైద్యం కొనసాగుతోంది. ఇటీవలే మహారాష్ట్రలోని థానేలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా 60 మంది గాయపడ్డారు.