Chandrababu Participates in Bojjala Gopala Krishna Reddy Last Rights: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి అంత్యక్రియల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కొంత దూరం వరకూ బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి పాడె మోశారు. 

Continues below advertisement


అంతకుముందు చంద్రబాబు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ లో రోడ్డు మార్గాన ఊరూందురూకు బయలుదేరి వెళ్లారు. అంతకముందు చంద్రబాబు రాక కోసం‌ ఎదురు చూస్తున్న
టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (Bojjala Gopala Krishna Reddy) శనివారం చనిపోయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఉన్న ఆయన కొంత కాలంగా మంచానికే పరిమితం అయ్యారు. ఆయన పరిస్థితి విషమించడంతో వారం క్రితం అపోలో ఆస్పత్రిలో (Appllo Hospital) చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్లుగా వైద్యులు చెప్పారు. 


అలిపిరి ఘటనలో తీవ్ర గాయాలు


బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు మిత్రుడు. చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్లు జరిపిన దాడిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గాయపడ్డారు. ఆ గాయాలకు ఆయన చాలా కాలం పాటు చికిత్స తీసుకున్నారు. పలు ఆపరేషన్లు కూడా చేయించుకోవాల్సి వచ్చింది. గత నెలలో బొజ్జల పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు ఇతర సన్నిహితులతో ఆయన ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించారు. 


అలిపిరి దాడిలో తీవ్రగాయాలు అయినా  రాజకీయంగా ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు.. బొజ్జల 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన ఆ తర్వాత శ్రీకాళహస్తి (Sri Kalahasti) ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి మంత్రి వర్గంలో ఆయన ఆటవి శాఖ మంత్రిగా పని చేశారు. అయితే, అనారోగ్యం కారణంగా చివరిలో ఆయనకు విశ్రాంతినిచ్చారు చంద్రబాబు. గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి బొజ్జలకు బదులుగా ఆయన తనయుడు సుధీర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


అప్పట్లో కేసీఆర్, మండవ, బొజ్జల స్నేహితులు


ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశంలో ఉన్న సమయంలో ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్, మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆత్మీయ మిత్రులుగా ఉండేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా పలు సందర్భాలలో కేసీఆర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మధ్య ఆత్మీయ సమావేశాలు జరిగాయి. బొజ్జల అనారోగ్యంతో ఉన్నారని తెలిసిన తర్వాత కేసీఆర్ కూడా హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.