Tirumala: తిరుమలలో ఆగి ఉన్న కారులో నుండి మంటలు చెలరేగాయి. సీఆర్వో కార్యాలయానికి సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో గత రెండు రోజుల క్రితం తిరుమలకు చేందిన ట్యాక్సి డ్రైవర్ ఏపీ 39 టీవై 2165 నెంబరు గల కారును పార్కు చేశాడు. అయితే పార్కింగ్ నుండి కారును తీసుకెళ్ళెందుకు స్టార్ట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావడంతో కారు ముందు భాగంలో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. కారు నుండి మంటలు రావడాన్ని చూసి భయంతో భక్తులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తం అయిన కారు డ్రైవర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్ధలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో సమీపంలోని దుకాణదారులు, యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. కారు డ్రైవర్ అప్రమత్తం కావడం, కారులో ఎవరూ యాత్రికులు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. హుటాహుటిన ఫైర్ సిబ్బంది స్పందించడంతో స్పల్పంగా కారుకు స్వల్పం నష్టం వాటిల్లింది.
నాగర్ కర్నూల్ జిల్లాలోనూ..
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విద్యానగర్‌లో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహిపాల్ నాయక్ అనే ఉపాధ్యాయుడి ఇంటికి శనివారం ఆయన బంధువు ఒకరు కారులో వచ్చారు. ఇంటి వద్దకు చేరుకున్న తర్వాత కారును నిలపగా. అకస్మాత్తుగా అందులో నుంచి పొగలు వచ్చాయి. కాసేపటికే మంటలు చెలరేగి క్షణాల్లోనే అగ్ని కీలలు కారు మొత్తం వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. కారులో మంటలు చెలరేగిన సమయంలో చుట్టు పక్కల ఇళ్లు ఉండడంతో పలువురు భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్‌లోనూ
హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో కూడా కారులో మంటలు చెలరేగాయి. కారు లో నుంచి పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమైన కారులోని వారు కిందకు దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కారు మొత్తం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. వడగాడ్పులతో ఉష్ణోగ్రతలు భారీ నమోదవుతున్నాయి. దీంతో కార్లలో మంటలు చెలరేగుతున్న ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కారును ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకోవడం, బ్యాటరీ, వైర్లు మన్నికగా ఉండేవి వాడడం వల్ల ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.