Annamayya District  Girisha have been suspended By Central Election Commission: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్నికల ప్రక్రియ మొదలు కాక ముందే ఓ కలెక్టర్‌పై వేటు పడింది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల టైంలో జరిగిన అక్రమాలకు ఊతం ఇచ్చారన్న కారణంతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అన్నమయ్య కలెక్టర్‌గా ఉన్న గిరీష్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. 


తిరుపతి ఉపఎన్నికల టైంలో గిరీష్‌ తిరుపతి(Tirupati) కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లు వేసుకునేందుకు సాయం చేశారన్న ఆరోపణలతో కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్నికకు ఈఆర్‌వోగా ఉన్న గిరీష్‌ తన లాగిన్ ఐడీని నేతలకు ఇచ్చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై కొన్ని రోజుల క్రితం ఈసీ పర్యటన సందర్భంగా అధికారులు ప్రశ్నించారు. అవేమీ తనకు తెలియవని గిరీషా సమాధానం చెప్పారు. 


తిరుపతి ఉపఎన్ని సందర్భంగా గిరీషా లాగిన్ ఐడీని ఎవరు ఎందుకు దుర్వినియోగం చేశారో చెప్పాలని విచారణ చేపట్టింది. ఈ విచారణలో గిరీషా లాగిన్ ఐడీ ద్వారా 30 వేలకుపైగా ఎపిక్‌ కార్డుల్ని అక్రమంగా డౌన్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. దీంతో గిరీషాను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. 


గిరీషాతోపాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారుల వివరాలు కూడా పంపించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. జిల్లా యంత్రాంగంతోపాటు రాష్ట్ర ఎన్నికల అధికారిని కూడా ఆదేశించింది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని బీజేపీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈసీ రెండేళ్ల తర్వాత చర్యలు తీసుకుంది. 


రాష్ట్రంలో ఓటర్ల లిస్ట్‌లో అక్రమాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అధికారులు వైసీపీ లీడర్లు ఏకమైన ప్రత్యర్థుల ఓట్లను తొలగిస్తున్నారని.. తమకు అనుకూలురైన వారి ఓట్లను దొంగ ఓట్లుగా చేర్పిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దీనిపై వివిధ స్థాయిలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ మధ్య రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యామ్ ఫిర్యాదు చేశారు. ఫామ్‌ 7 పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని చర్యలు తీసుకోవాలని సాక్ష్యాలతో ఇచ్చారు. 


ఇప్పుడు గిరీషాపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం ఇతర అధికారులపై కూడా దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చాలా మంది అధికారులు వైసీపీ లీడర్లు చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాంటి వారందర్నీ ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.