NTR Death Anniversary : రాముడైనా (Lord Rama) కృష్ణుడైనా (Lord Krishna ) ధూర్యోధనుడైనా...కర్ణుడైనా...మొదట గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్ (NTR).  పౌరాణికం, జానపదం, భక్తిరసం...ఇలా ఏ చిత్రాల్లో నటించినా నటనలో మేటి. తెలుగు ప్రజలకు ఆరాధ్యదైవం. వెండితెర వేల్పు...ఎంతలా అంటే...ఆయనలో రాముడ్ని చూసుకున్నారు..కృష్ణుడ్ని చూసుకున్నారు. మరే నటుడికి సాధ్యం కాని విధంగా చరిత్రలో నిలిచిపోయే పాత్రల్లో నటించారు. ఎవరికి అందని రికార్డులను సొంతం చేసుకున్నారు.


వెండితెరపై తిరుగులేని ముద్ర వేసిన ఎన్టీఆర్‌...రాజకీయాల్లోనూ ప్రత్యేకతను చాటుకున్నారు. అటు సినిమా రంగం...ఇటు రాజకీయాల్లో...ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగారు. ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్‌ చేశారు. రాజకీయ పార్టీ పెట్టి...అతి తక్కవ కాలంలోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించిన మేరునగధీరుడు ఎన్టీఆర్‌. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఎన్టీఆర్ వర్దంతి నేడు. 1923 మే 28న క్రిష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. 1996 జనవరి 18న తెలుగు ప్రజలకు దూరమయ్యారు. ఆయన మరణించి నేటికి 27 ఏళ్లు.  


కొత్త ఒరవడికి తెరతీసిన ఎన్టీఆర్‌ 
1982 మార్చి 29న ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారు.  చైతన్య రథాన్ని సిద్దం చేసి.. ఓట్లేయండని జనంలోకి వచ్చారు ఎన్టీఆర్. ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తా ఎలా ఉంటుందో చూపించారు. ఇప్పుడు రోడ్‌ షోల పేరుతో నేటి తరం రాజకీయ నేతలు చేస్తున్న ప్రచారానికి ఆద్యుడు ఎన్టీఆరే. ఎక్కడ గ్రామం కనిపిస్తే అక్కడే బహిరంగ సభ. చైతన్య రథంలోనే పడక. రోడ్డు పక్కనే స్నానపానాదులు. అలా ఒక కొత్త ఒరవడికి ఎన్టీఆర్‌ తెరతీశారు. ఆయన వస్తున్నారంటే ఊళ్లకు ఊళ్లే తరలి వచ్చేవి. ఆయన రావడం ఆలస్యమైతే, రోజుల తరబడి ఎదురు చూసేవారు. పేదవాడే నా దేవుడు... సమాజమే నా దేవాలయం అంటూ ఎన్టీయార్‌ చేసిన ప్రసంగాలు ప్రజల మనసుల్లో బలంగా నాటుకు పోయాయి.


ప్రజల మధ్య ప్రమాణస్వీకారం చేసిన తొలి ముఖ్యమంత్రి
1983 జనవరి 9న ప్రజల సమక్షంలోనే ఎల్‌బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పాలనలో ప్రజాస్వామ్య విలువలకు పెద్ద పీట వేసి,  పారదర్శకత, నీతి నిజాయతీలకు మారు పేరుగా నిలిచారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లారు. ఎన్టీఆర్ రాజకీయంగా బీసీలకు పెద్దపీట వేశారు. మండల, జిల్లా స్థాయి పదవుల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా.. రాజకీయమంటే ఎరగని వారికీ మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా అవకాశం కల్పించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ద్వారా కోట్ల మందికి వరి బియ్యం అందించారు.


 రిజర్వేషన్లు, స్త్రీలకు ఆస్తిహక్కులో భాగం
1983 ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రణాళికను చూస్తే, సమాజంలోని అనేక సామాజిక శ్రేణుల, వర్గాల ఆకాంక్షలను స్పృశించే వాగ్దానాలు కనిపిస్తాయి. కాంగ్రెస్‌కు గట్టి మద్దతిచ్చే సామాజిక నియోజకవర్గమైన దళితులను ఆకట్టుకోవడానికి కూడా ఆ మేనిఫెస్టో ప్రయత్నించింది. విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, రిజర్వేషన్లు, స్త్రీలకు ఆస్తిహక్కులో భాగం, మధ్యాహ్న భోజనం, రెండు రూపాయలకు కిలోబియ్యం వంటివి పార్టీ వాగ్దానాలు ఇచ్చారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ అంతటికీ పనికివచ్చే నినాదంగా ఆంధ్రుల ఆత్మగౌరవం, కేంద్రం వివక్ష అన్న నినాదాలను తీసుకున్నారు. అవినీతిని, దుర్మార్గ పాలనను అంతం చేయడం అన్నది ప్రధాన నినాదం చేసుకున్నారు. మురళీధర్ రావు కమిషన్ దగ్గర నుంచి మండల్ సిఫార్సుల దాకా తెలుగుదేశం వైఖరి సామాజిక న్యాయం వైపే ఉంది. ఈ ఘనత ఎన్టీయార్‌దే. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయంలో.. బాగా చదువుకున్న యువతకు, అప్పటిదాకా రాజకీయ అవకాశాలు అందని వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి.. చట్టసభల్లో సామాన్యులు అడుగుపెట్టడానికి ఆద్యులు అన్న ఎన్టీఆరే.