Cm Jagan Message : విజయవాడలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) మహాశిల్పం ఆవిష్కరణ జరగనుంది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(AP CM YS Jagan) ప్రజలకు ప్రత్యేకం సందేశం ఇచ్చారు. ఈ నెల 19న చారిత్రక స్వరాజ్య మైదానంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ విగ్రహం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహంగా నిలవనుంది. బెజవాడలో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ మహా శిల్పం...మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అని అన్నారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం అని కొనియాడారు.
206 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం
అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు అయితే...పెడస్టల్ ఎత్తు 81 అడుగులుగా ఉంది. అంటే మొత్తం 206 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఠీవిగా కనిపించనుంది. 18.81 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటైంది. ఇందులో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాలు, శిల్పాలుంటాయి. ఓ కన్వెన్షన్ హాల్, ఫుడ్ కోర్టులు ఉంటాయి. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌గా ఈ విగ్రహం ప్రాచుర్యంలో రానుంది.
ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం, ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా భావాలను వ్యక్తం చేశారని సీఎం జగన్ అన్నారు. దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు.
అంబేద్కర్ భావాలను నవరత్నాల్లో అనుసరిస్తున్నాం
బాధ్యతతో, అంబేద్కర్ భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని నవరత్నాల్లో అనుసరిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విగ్రహా ఆవిష్కరణ సందర్బంగా...19వ తేదీన ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. అంబేద్కర్ అనుగారిన వర్గాలకు చదువును దగ్గరగా తీసుకెళ్లిన మహనీయుడని, అంటరానితనం మీద ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన మహానుభావుడని అన్నారు. సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపం అంబేద్కర్ అన్న సీఎం జగన్...రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి అని కొనియాడారు. ప్రతి వాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం ధైర్యాన్ని, అండని ప్రసాదించే ఓ మహా స్ఫూర్తి అని గుర్తు చేశారు.
అనేక మార్పులకు అంబేద్కర్ భావాలే కారణం
కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో అంబేద్కర్ వెలుగులు నింపారని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం...డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భావాలేనన్నారు. అందుకే ఆయనకు ఇంతలా గౌరవించుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ నెల 19న విజయవాడలో ఆవిష్కరిస్తున్న ఈ మహా శిల్పం...ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటం ఖాయమన్నారు. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు అంబేద్కర్ విగ్రహం స్ఫూర్తినిస్తుందన్నారు. ఇది మన సమాజ గతిని, సమతా భావాల వైపు మరల్చటానికి ఉపయోగపడుతుందన్నారు. సంఘ సంస్కరణకు, పెత్తందారీ భావాల మీద తిరుగుబాటుకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు, నిరంతరం అంబేద్కర్ విగ్రహం స్ఫూర్తి ఇస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.