Madanapalle sub collectors office | మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీఐడీకి అప్పగించారు. మదనపల్లె ఫైళ్ల దహనం కేసును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ నుంచి అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయానికి సీఐడీకి కేసు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు అందాయి. మరో రెండు రోజుల్లో ఫైళ్ల దహనం కేసు ఫైల్ మొత్తాన్ని పోలీసులు సీఐడీకి అప్పగించనున్నారు.
జులై 21న రాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనం కావడం కలకలం రేపింది. ఈ ఘటనపై మదనపల్లె పోలీసులు 9 కేసులు నమోదు చేశారు. రెండ్రోజుల్లో కేసు మొత్తాన్ని సీఐడీకి అప్పగించనున్నారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
మదనపల్లె సబ్‌కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో సంబంధిత అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. మాజీ ఆర్డీవో మురళిని, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్ లతో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌లపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా జులై 29న ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ లో కీలక ఫైల్స్ కాలిపోవడంతో సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. కీలక ఫైళ్లు దగ్ధమైనప్పటికీ, సంబంధిత అధికారులు సకాలంలో స్పందించలేదని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషాకు ఈ కేసులో మదనపల్లె పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ అధికారులు ఇంటికి వెళ్లి నోటీసులు ఇవ్వగా, కుటుంబసభ్యులు బెంగళూరులో ఉన్న నవాజ్ భాషాకు కాల్ చేసి సమాచారం అందించారు. కాగా, కలెక్టరేట్ లో దగ్ధమైన ఫైళ్లలో భూములకు సంబంధించిన దస్త్రాలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఫైళ్లను కాల్చడం వెనుక కుట్ర కోణం దాగి ఉండొచ్చని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో విధులు సరిగా నిర్వహించలేదని సీఐ వలిబసుపై చర్యలు తీసుకున్నారు. సీఐ వలిబసును వీఆర్‌కు పంపుతూ జులై 24 ఆదేశాలు జారీ చేశారు.
Also Read: రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో జగన్ పిటిషన్, అంత సెక్యూరిటీ అవసరమా?: హోంమంత్రి అనిత