Telangana Medical Seats: తెలంగాణలోని వైద్య ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో జాతీయ కోటా మినహా మిగిలిన కన్వీనర్ కోటా సీట్లన్నీ స్థానిక విద్యార్థులకే దక్కనున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 10 సంవత్సరాలపాటు అమలైన 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్లు ఈ ఏడాది నుంచి రద్దయ్యాయి. రాష్ట్రంలో 2014కు ముందు ఏర్పాటైన అన్ని మెడికల్ కాలేజీల్లో 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడేవారు. అయితే 2024 జూన్ 2 నాటికి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. దీంతో కన్వీనర్ కోటా సీట్లన్నీ స్థానిక విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు. అయితే ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనలతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగనుంది.
స్థానికతపై వివాదం..
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో.. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన వర్సిటీ విడుదల చేసిన మార్గదర్శకాల్లో.. స్థానికత నిర్ధారణపై గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జులై 19న జారీ చేసిన 33జీవో ప్రకారం స్థానికత నిబంధనలను పేర్కొన్నట్టు వర్సిటీ తెలిపింది. ఈ నిబంధనలతో తీవ్ర అన్యాయం జరిగేలా ఉందని స్థానిక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 7 సంవత్సరాల కాలంలో గరిష్ఠంగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణలోకి తీసుకునేవారు. స్థానికతపై ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి చేసిన మార్పులతో తెలంగాణ వారికే ఎక్కువ అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏపీ విద్యార్థుల కోసమేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల గడువు.. ఈ ఏడాది జూన్ 2తో ముగిసింది. విద్యాసంస్థల్లో ఏపీ విద్యార్థులకు కోటాలోనూ ఇదే అమలు కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మక కళాశాలలు లేనందున.. అక్కడి విద్యార్థులకు వైద్యవిద్యలో అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 33ను తీసుకువచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోతో హైదరాబాద్‌లో చదివిన ఏపీ విద్యార్థులు తెలంగాణలో స్థానికులుగా ఉంటారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాలకు చెందిన వారు విజయవాడ, గుంటూరులలో ఇంటర్మీడియట్ చదువుతారు. అదే సమయంలో ఇంటర్మీడియట్ కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన తెలంగాణ విద్యార్థులు స్థానికేతరులుగా మారుతున్నారు. వారికి స్థానికత కోటాకు దూరమవుతున్నారు. తెలంగాణలో పుట్టి పెరిగి కేవలం రెండేళ్ల ఇంటర్మీడియట్ చదువుల కోసం ఏపీకి వెళ్లిన వారు సొంత రాష్ట్రంలో స్థానికులు కాకుండా పోతున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రైవేటు కాలేజీలకు మేలు చేసేందుకే స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ ప్రారంభం..
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో.. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 4న ప్రారంభమైంది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 13న సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ఆలిండియా కోటా సీట్ల భర్తీకి ఆగస్టు 14 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థుకలు ఆగస్టు 23న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో కాళోజీ యూనివర్సిటీ కూడా ఆగస్టు 20 తర్వాత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి, సీట్లను కేటాయించనుంది.
8,315 సీట్లు అందుబాటులో..
రాష్ట్రంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తం కళాశాలల సంఖ్య 60కి చేరింది. ఇందులో 30 ప్రభుత్వ కళాశాలలు, 30 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఆయా కాలేజీల్లో మొత్తం 8,715 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కాలేజీల్లో 4,115 సీట్లు; ప్రైవేట్ కాలేజీల్లో 4,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 3,498 సీట్లు ఉన్నాయి. ఇక ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 2,300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక మొత్తం సీట్లలో జాతీయ కోటా కింద 617 సీట్లు భర్తీ కానుండగా.. ఇక మిగిలిన సీట్లను రాష్ట్రంలో కాళోజీ హెల్త్ వర్సిటీ భర్తీ చేయనుంది.
రిజర్వేషన్ల వర్తింపు ఇలా ..
➥ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం సీట్లు దక్కనున్నాయి.
➥ 9, 10, ఇంటర్ ఇక్కడ చదివిన వారినే స్థానికులుగా పరిగణనలోకి తీసుకుంటారు.
➥ ఈ ఏడాది నుంచి 9, 10, ఇంటర్‌ను (వరుసగా నాలుగేళ్లు) రాష్ట్రంలో చదివినవారినే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కేటాయింపులో స్థానిక విద్యార్థులుగా పరిగణనలోకి తీసుకుంటారు.
➥ రాష్ట్రంలో ఈసారి నీట్-యూజీ పరీక్షను 77,848 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్షకు హాజరుకాగా.. 47,356 మంది అర్హత సాధించారు.