తిరుపతిలో గంగమ్మ జాతర సందర్భంగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి సారె సమర్పించారు. స్థానిక పద్మావతి పురంలోని భూమన నివాసం వద్ద బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భూమన కరుణాకర రెడ్డి, వారి కుటుంబ సభ్యులు పళ్లాలపై పసుపు, కుంకుమ,  పూలు, పళ్లు, రవిక, పట్టు చీరలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మ వారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 


గ్రామ దేవత గంగమ్మ సారె సమర్పణ కార్యక్రమం భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో భూమన నివాసం నుంచి అమ్మవారి ఆలయం వరకు జనసందోహంగా మారింది. వీధులు అన్నీ వేపాకు తోరణాలతో పాటు మామిడి, అరటి తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  దారి పొడవునా మహిళా భక్తులు పసుపు నీళ్లు కుమ్మరిస్తూ, కర్పూర హారతులిస్తూ స్వాగతించారు. స్థానికులు పెద్ద ఎత్తున గంధం బొట్లు పెట్టుకుని, వేపాకు చేతబూని, వివిధ వేష ధారణలతో వచ్చేసి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. దారి పొడవునా జానపద శైలిలో సాగే అమ్మ వారి కీర్తనలతో, డప్పు వాయిద్యాల మధ్య భక్తులు లయబధ్ధంగా చిందేస్తూ  పులకించి పోయారు.  గంగమ్మ నామ స్మరణతో తిరునగరి హోరెత్తింది. నవ దుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు, తీన్ మార్,  కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల కళాప్రదర్శలు ఆకట్టుకున్నాయి. 


వేసవి తీవ్రతను లెక్కచేయకుండా శోభా యాత్ర కొనసాగింది. భూమన నివాసం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.


ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. ఒకనాటి తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. అన్ని గ్రామాలకూ ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.


చరిత్ర ఏంటంటే..
గంగమ్మ జాతర చరిత్రకు ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్తవయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు.