Bharat Bandh 144 Section In Tirupati: తిరుపతి : అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ప్రజాసంఘాల పిలుపుమేరకు నేడు భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు సహా తిరుపతి నగరంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. గత వారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనకు దిగడం, ఆపై రైలు బోగీలను తగలబెట్టడంతో తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏపీలో పలు చోట్ల నిఘా పెంచారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో మరింతగా పోలీసు బలగాలను మోహరించారు. రైల్వే స్టేషన్ ముందు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి కేవలం ఒక మార్గం ద్వారా మాత్రమే ప్రయాణికులు రాక పోకలు కొనసాగించే విధంగా పోలిసులు చర్యలు చేపట్టారు. మిగిలిన మూడు మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలను నిషేధించడమే కాకుండా ఆక్టోపస్, సీఆర్పీఎఫ్, ఏఆర్ పోలీసు బలగాలతో కట్టు దిట్టమైన బందోబస్తులు ఏర్పాటు చేశారు.
తిరుపతిలో 144 సెక్షన్
తిరుపతి రైల్వే స్టేషనుతో పాటు గూడూరు, పాకాల రైల్వే జంక్షన్ల వద్ద దాదాపుగా 500 మంది పోలీసులతో బందోబస్తులు కల్పించారు.. భారత్ బంద్ నేపధ్యంలో తిరుపతిలో 144 సెక్షన్ అమలు చేయడం (144 Section Imposed in Tirupati)తో పాటుగా ఎవరూ గుంపుగా గుమి ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాంమని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి ప్రకటించారు. విద్యార్ధులను రెచ్చగొట్టి రైల్వేస్టేషన్ కు వచ్చి విధ్వంసం సృష్టిస్తారోమో అనే ఉద్దేశంతో ముందస్తుగానే విద్యార్ధి సంఘ నేతలను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు.
ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిఘా
తిరుపతిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. ఇక తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే భక్తులకు మినహా ఇంపు ఇస్తూ, భక్తులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ వద్దకు ఎటువంటి వాహనాలు, బస్సులను పోలీసులు అనుమతించక పోవడంతో ప్రయాణికులు నడుచుకుంటూ బస్ స్టాండ్ చేరుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. దీంతో చిన్నారులు, వృద్దులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రైల్వే స్టేషను లోపల పోలీసు బలగాలతో పాటుగా పరిస్ధితి సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు పోలీసులు.
Also Read: Viral News: 30 ఏళ్ల తరువాత ఎగ్జామ్ - టెన్త్ బోర్డ్ ఎగ్జామ్‌లో తండ్రి పాస్, కుమారుడు ఫెయిల్