ఇటీవల ఏపీలో టెన్త్ ఫలితాలు రాగా, పాస్ శాతం తక్కువ రావడం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం నాడు మహారాష్ట్రలోనూ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. రికార్డు స్థాయిలో 96.94 శాతం మంది పాస్ అయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఇది కాస్త తక్కువ. అయితే అసలు విషయం ఏంటంటే.. కుమారుడితో కలిసి పరీక్ష రాసిన తండ్రి పాస్ కాగా, టెన్త్ విద్యార్థి ఫెయిలయ్యాడు. దాంతో తండ్రి, కుమారులు ఇద్దరూ బాధపడుతున్నారు. తాను పాసైనప్పటికీ టెన్త్ పరీక్షల్లో కుమారుడు ఫెయిల్ కావడం ఆ తండ్రిని బాధకు గురి చేస్తోంది.
ఒకేసారి టెన్త్ పరీక్షలకు హాజరైన తండ్రి,కొడుకు
మహారాష్ట్ర పుణెకి చెందిన 43 ఏళ్ల భాస్కర్ వాఘ్మరె చాలా ఏళ్ల కిందట స్కూల్ చదువు మధ్యలోనే మానేశారు. 7వ తరగతిలో ఉండగా కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించక చదువుకు గుడ్ బై చెప్పేశారు. ప్రైవేట్ జాబ్ చేస్తూ కుటుంబ బారాన్ని తనపై వేసుకున్నారు. కాగా, ఆయన కుమారుడు సహిల్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెన్త్ పరీక్షలకు కుమారుడు సాహిల్, తండ్రి భాస్కర్ వాఘ్మరె ఒకేసారి హాజరయ్యారు. తండ్రీకొడుకు ఒక్కసారి టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసిన సమయంలో ఎలాగైతే విషయం వైరల్ అయిందో ఫలితాల తరువాత కూడా అదే సీన్ రిపీట్ అయింది.
తండ్రి పాస్, కుమారుడు ఫెయిల్
కరోనా కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది పరీక్షలు నిర్వహించలేదు. ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కులతో ఫలితాలు ప్రకటించగా 99.95 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది నిర్వహించిన టెన్త్ పరీక్షల ఫలితాలు శుక్రవారం నాడు మహారాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయగా 96.94 శాతం విద్యార్థులు పాసయ్యారు. దాదాపు 30 ఏళ్ల తరువాత మానేసిన చదువును టెన్త్ పరీక్షతో శ్రీకారం చుట్టారు భాస్కర్. ప్రతిరోజూ ఆఫీసు నుంచి వచ్చాక కుమారుడితో కలిసి టెన్త్ పరీక్షలకు ప్రిపేరయ్యారు. ఫలితాలు మాత్రం వారిని బాధించాయి. కుమారుడు పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తాను పాసైనా తండ్రి అంత సంతోషంగా లేరు.
ఈ ఏడాది ఎలాగైనా పరీక్షలు రాసి టెన్త్ కావాలని భావించినట్లు తండ్రి భాస్కర్ తెలిపారు. తన కుమారుడి సహకారంతో టెన్త్ పాసైనట్లు చెప్పిన ఆయన.. కుమారుడి ఫలితాలు బాధ కలిగించాయని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలలో ప్రిపరేషన్‌లో కుమారుడికి సాయం చేస్తానని చెప్పారు.
చాలా ఏళ్ల తరువాత పరీక్షలు రాసినప్పటికీ నాన్న పాసైనందుకు సంతోషంగా ఉందన్నాడు సాహిల్. తాను సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని, ఈసారి తప్పకుండా పాస్ అవుతానని ధీమా వ్యక్తం చేశాడు టెన్త్ విద్యార్థి.