మూడు రోజులుగా బెంగాల్ టైగర్ జాడ కనిపించడంలేదు. పులి పాదముద్రలు కూడా అటవీశాఖ అధికారులకు లభ్యం కాలేదు. నాలుగు రోజుల క్రితం పశువులపై దాడి చేసిన గ్రామమైన శరభవరంలో మాత్రం పులి టెన్షన్ స్థానిక ప్రజలలో కనిపిస్తోంది. ఎవ్వరిని కదిపినా అది ఎక్కడికీ పోలేదని, ఏ సమయంలోనైనా దాడిచేసే అవకాశం లేకపోలేదని అందుకే భయం భయంగా బతుకుతున్నామని చెబుతున్నారు. పెద్దపులి అసలు శరభవరంలోనే ఉందా.. లేక మరో ప్రాంతానికి మకాం మార్చిందా అన్న సందిగ్ధత పలువురి నుంచి వ్యక్తమవుతోంది. అటవీశాఖ అధికారులు రెండు రోజులుగా ఈప్రాంతంలో సరిగ్గా కనిపించకపోగా కేవలం దిగువ స్తాయి అధికారులు, సిబ్బంది మాత్రమే పులి కదలికలపై ఓ వాహనం ది ద్వారా పరిశీలన చేస్తున్నారు. 


నాలుగు రోజుల క్రితం పులి దాడిలో గాయపడ్డ ఆవు దూడ బతికే అవకాశాలు లేవని వెటర్నిటీ డాక్టర్లు చెబుతున్నారు. పులి పంజా దెబ్బకు ఆవుదూడ మెడభాగం బాగా దెబ్బతినగా తల భాగం నిలబెట్టలేకపోతోంది. మేత తినడం కూడా మానేసిందని రైతు చెబుతున్నాడు. పశువుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక మనుషులపై దాడిచేస్తే పరిస్థితి ఏంటని తీవ్ర కలత చెందుతున్నారు.


దాదాపు పంట పొలాలన్నీ ఖాళీ.. 
తొలకరి పంట సమయం ఆసన్నమయ్యింది. మరోపక్క తొలకరి వర్షాలు కూడా ప్రారంభం కావడంతో ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల పరిధిలో పొలాల్లో రైతు లతో సందడి వాతావరణం కనిపించేది.. అయితే ఇప్పుడు పెద్దపులి భయంతో ఆ పరిస్థితి పూర్తిగా కనిపించడంలేదు.. జనావాసాలకు సమీపంలో ఉన్న పొలాల్లో మాత్రమే భయం భయంగా పనులు చేసు కుంటున్నారు రైతులు.. అది కూడా ఎండ కాస్తేనే ... వాతావరణం చల్లబడితే ఆ ప్రయత్నం మానుకుంటున్నారు.


ఇంకా చేరుకోని మహారాష్ట్ర బృందం..
రాయల్ బెంగాల్ టైగర్‌ను వేటాడేందుకు మహారాష్ట్ర నుంచి తడోబా బృందాన్ని రప్పిస్తున్నట్లు ఫారెస్ట్ ఉన్నతాధికారులైతే వెల్లడించారు కానీ ఇంకా వారు శరభవరం ప్రాంతానికి చేరుకోలేదు. శరభవరం గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో బస ఏర్పాటు చేసుకున్నటువంటి అటవీశాఖ అధికారులు అక్కడే తమ వాహనాలను పెట్టుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అయితే రెండు రోజులుగా ఉన్నతాధికారులెవరూ రాలేదని, కేవలం కొంత మంది సిబ్బంది మాత్రం ఓ వాహనంలో తిరుగుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా అయితే పులిని పట్టుకోవడం వీరి తరం కాదని, కేవలం పులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రలు ప్రజలే గుర్తించి వారికి సమాచారం ఇస్తుంటే అది నిర్ధారించుకోవడానికి వస్తున్నారు కానీ పులి ఎక్కడ సంచరిస్తుందో గుర్తించడానికి ప్రయత్నించడంలేదని విమర్శిస్తున్నారు. పులిభయం ప్రారంభమై ఇప్పటికి 28 రోజులు దాటిందని, ఇంతకాలం కేవలం అధికారుల వైఫల్యం వల్లనే మూడు మండలాల పరిధిలోని గ్రామాల్లో రైతులు పంటలు వేసుకోలేకపోయారని మండిపడుతున్నారు.


ఆగ్రామాల్లోనే తిష్టవేసిందని అనుమానం.. 
స్థానికులు మాత్రం పులి ఎక్కడికీ వెళ్లలేదని, కొండ అవతల అడవిలో పాగా వేసిందని చెబుతున్నారు. దానికి పశువుల అలికిడి వినిపిస్తే వెంటనే ఇటువైపుగా దూసుకువస్తుందంటున్నారు. ప్రత్తిపాడు మండల పరిధిలో శరభవరం, పొదురుపాక, పాండవులపాలెం, ఉత్తరకంచి. పెద్దిపాలెం, బావురువాక శంఖవరం మండల పరిధిలో వజ్రకూటం, నెల్లిపూడి తదితర గ్రామాలు, ఏలేశ్వరం మండల పరిధిలో పెద్దశంకర్లపూడి, చినశంకర్లపూడి తదితర గ్రామాల్లో పులిభయం నీడలా వెంటాడుతుంది.