ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలుకావడం నుంచి రిజల్ట్స్ తరువాత సైతం పరిస్దితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ఏపీ టెన్త్ ఫలితాల్లో కేవలం 67 శాతం విద్యార్థులు పాసయ్యారు. అయితే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి సప్లిమెంటరీ పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజులు కట్టించుకోకుండా సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను అనుమతించాలని కోరిన నేపథ్యంలో టెన్త్ ఫెయిన్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు కట్టకున్నా హాల్ టికెట్స్ జారీ చేయనున్నారు.
ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి కట్టనవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి .వి.నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజులపై విద్యార్థులు ఆందోళన చెందనవసరం లేదని వెల్లడించారు. ప్రస్తుతానికి విద్యార్థుల వద్ద నుంచి వసూలు చేసిన ఫీజును ప్రధానోపాధ్యాయుల వద్దనే ఉంచుకోవాలని వారికి సూచించారు. ప్రభుత్వం సప్లమెంటరీ పరీక్ష ఫీజును 500, రీవెరిఫికేషన్ కు వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది. జూలై 6 నుంచి జూలై 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స ఫలితాలు వచ్చిన రోజు తెలిపారు.
రెండేళ్ల తరువాత బోర్డ్ ఎగ్జామ్స్.. ఎన్నో పరీక్షలు
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండేళ్ల పాటు పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పాస్ చేస్తూ వస్తోంది. గత విద్యా సంవత్సరంలో కరోనా నుంచి కోలుకోవడంతో తరగతులు కొన్ని నెలలు నిర్వహించారు. విద్యార్థులకు సిలబస్ తగ్గింపు, పేపర్లు తగ్గింపు లాంటి ఊరట కలిగించే ఎన్నో నిర్ణయాలను ఏపీ విద్యాశాఖ తీసుకుంది. రెండేళ్ల అనంతరం గతంలో నిర్వహించినట్లు ఏపీ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించారు. కానీ ఈ సారి ఎన్నో రాజకీయ పరిణామాల మధ్య పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఉత్తీర్ణత శాతం చాలా తగ్గడంతో ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యాన్ని చేసుకుని విమర్శలు గుప్పించాయి. అయితే విద్యార్థులు సొంతంగా పాస్ కావాలని, ప్రభుత్వం నేరుగా పాస్ చేస్తే వారి జీవితాలను నాశనం చేయడం అవుతుందని భావించారు. మార్కులు కలపడం ఉండదని, సప్లిమెంటరీ రాసి పాస్ కావాలని విద్యార్థులకు సీఎం జగన్ సైతం సూచించారు.
మూడు, నాలుగు మార్కుల వరకు తక్కువ రావడంతో ఫెయిలైన టెన్త్ విద్యార్థులను పాస్ చేయాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కొందరు డిమాండ్ చేశారు. మరికొందరైతే ఏకంగా 10 శాతం గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయాలని ప్రభుత్వానికి సూచించగా.. కొందరు నేతలు ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థిని పాస్ చేసి వారికి న్యాయం చేయాలన్నారు. అందుకు కరోనాను కారణంగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయానికి కట్టుబడి ఉందని, విద్యార్థులు సప్లిమెంటరీ రాసి పాస్ కావడం వారి జీవితాలకు మేలు చేస్తుందన్నారు. అయితే ఈ ఏడాది సప్లి రాసి పాసైన వారిని రెగ్యూలర్ విద్యార్థుల తరహాలో డైరెక్ట్ పాస్ అయినట్లు మెమోలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఫీజుల కోసమే పరీక్షలని విమర్శలు రావడంతో విద్యార్థుల వద్ద నుంచి ప్రస్తుతానికి ఎలాంటి ఫీజు వసూలు చేయవద్దని, అందరికీ హాల్ టికెట్లు జారీ చేయాలని ఏపీ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు.