అగ్నివీరులకు వెల్‌కమ్ చెబుతాం: ఆనంద్ మహీంద్రా



అగ్నిపథ్‌పై కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నడుస్తున్నాయి. కేంద్రం ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా యువకులు ఉద్యోగ భద్రత కోల్పోతామంటూ నినదిస్తున్నారు. అయితే అగ్నివీరులకు తమ సంస్థలో అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ట్రాక్టర్ల తయారీ నుంచి ఫైనాన్షియల్ సర్వీసెస్‌ వరకూ అన్ని రకాల సేవలందిస్తోంది మహీంద్ర సంస్థ. వీటిలో ఏదో ఓ విభాగంలో ఉద్యోగం చేసేందుకు వారికి ప్రాధాన్యతనిస్తామని వెల్లడించారు. అగ్నిపథ్‌ ఆందోళనలు తనకు బాధ కలిగిస్తున్నాయని, ఈ పథకం వల్ల యువతో క్రమశిక్షణ పెరుగుతుందని అని ట్వీట్‌లో ప్రస్తావించారు. అగ్నివీరులు తమ సర్వీస్‌ అయిపోయేనాటికి ఏ ఉద్యోగమైనా సమర్థవంతంగా చేసేలా తయారవుతారని అన్నారు. అలాంటి వారిని రిక్రూట్ చేసుకునేందుకు మహీంద్ర గ్రూప్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని స్పష్టం చేశారు.





 


అగ్నివీరులకు మంచి అవకాశాలొస్తాయ్..


అగ్నివీర్‌ల గురించి మీ అభిప్రాయమేంటన్న ప్రశ్నకి బదులిచ్చారు ఆనంద్ మహీంద్రా. కార్పొరేట్ సెక్టార్‌లో అగ్నివీరులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించే అవకాశముందని అన్నారు. నాయకత్వ లక్షణాలు, ఫిజికల్ ఫిట్‌నెస్ లాంటి సానుకూలతలు వారిని "మార్కెట్ రెడీ"గా తీర్చి దిద్దుతాయని అభిప్రాయపడ్డారు. అడ్మినిస్ట్రేషన్‌ నుంచి సప్లై చైన్ మేనేజ్‌మెంట్ వరకూ అన్ని విభాగాల్లోనూ అగ్నివీరులకు తిరుగుండదు అని చెప్పారు ఆనంద్ మహీంద్రా. అగ్నివీరులకు భవిష్యత్‌లో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని కేంద్రం కూడా వివరిస్తోంది. పలు రంగాల్లో వారికి ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్స్‌లో భాగంగా ప్రాధాన్యత దక్కుతుందనీ చెబుతోంది. కానీ యువత మాత్రం పలు వాదనలు వినిపిస్తూ, ఆందోళనలకు దిగుతోంది. 


ఈ క్రమంలోనే సైనిక ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. అగ్నిపథ్‌లో భాగంగా ఎంపికైనా అగ్నివీరులు సర్వీస్‌లో ఉండగా అమరులైతే వారికి కోటి రూపాయల పరిహారం దక్కుతుందని వెల్లడించారు సైనిక వ్యవహారాల అదనపు సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ. సియాచెన్‌తో సహా మరికొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పని చేసే సైనికులతో సమానంగా అగ్నివీరులకూ ప్రాధాన్యత దక్కుతుందని వెల్లడించారు. ఈ విషయంలో అగ్నివీరులపై ఎలాంటి వివక్ష ఉండదని అన్నారు. ప్రస్తుతానికి అగ్నిపథ్‌లో భాగంగా 46 వేల మందిని తీసుకుంటున్నామని, త్వరలోనే ఈ సంఖ్యను 1.25 లక్షలకు పెంచుతామని తెలిపారు. వచ్చే నాలుగైదేళ్లలో క్రమంగా ఈ సంఖ్యను 50 వేలు, 60 వేలకు పెంచుతామని, ఆ తరవాత ఒకేసారి లక్ష మందిని రిక్రూట్ చేసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్ట్‌లా దీన్ని చేపట్టామని, పూర్తి స్థాయిలో పరిశీలించాక క్రమంగా విస్తరిస్తామని చెప్పారు అనిల్ పూరీ. 


 


Also Read: Jammu Kashmir: కశ్మీర్‌లో ఇకపై ఆ స్కూల్స్ కనిపించవు, బ్యాన్ చేసిన కేంద్రం


Also Read: Viral News: 30 ఏళ్ల తరువాత ఎగ్జామ్ - టెన్త్ బోర్డ్ ఎగ్జామ్‌లో తండ్రి పాస్, కుమారుడు ఫెయిల్