కరోనా సమయంలో వేసి చీటీలు వసూలు కాక నష్టపోయి అప్పులు ఊబిలో చిక్కుకుందో ఫ్యామిలీ. చేసిన అప్పులు తీర్చలేక కన్నబిడ్డలను అనాథలను చేసి ఓ బ్యాంక్ ఉద్యోగి దంపతులు సూసైడ్ చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో విషాదం నింపింది.
చిత్తూరు జిల్లా నగిరిలో ఉండే గౌరి ఓ బ్యాంకులో ఉద్యోగి. భర్త శివ నాగ భాస్కర్ హైదరాబాద్‌లోని ఓప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. వీళ్లకు పాప. ఒక్కటిన్నర ఏళ్ళ బాబు ఉన్నాడు. పెళ్ళైన ఆరు నెలల నుంచి ఉద్యోగ రీత్యా వేర్వేరుగా ఉండాల్సి వచ్చింది. బదిలీ కోసం గౌరీ చేయని ప్రయత్నం లేదు. దంపతులు ఇద్దరూ వేర్వేరు ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తుండంతో సంతోషంగా గడిపినా రోజు చాలా తక్కువ. అనుకున్న చోటికి బదిలీ కాక పోవడం, బ్యాంకుల్లో రుణం దొరక్క పోవడంతో చేసిన అప్పులు తీర్చ లేక గౌరీ దంపతులు నగిరిలోని సూసైడ్ చేసుకున్నారు.
గౌరీ తన డైరీలో ఏం రాసిందంటే...???
చనిపోతున్నప్పుడు గౌరి ఓ లెటర్ రాసి చనిపోయారు. అందులో ఏముంది అంటే..."మేం చేసింది తప్పు.. అందుకు అందరూ మమ్మల్ని క్షమించాలి. మాకు బతకాలని ఉన్నా వేరొక మార్గం కనిపించలేదు. బాధను వేరొక పనితో దూరం చేసుకునేందుకు 2019లో చిట్టీల వ్యాపారం మొదలు పెట్టాను. మొదట ఐదు లక్షల రూపాయల చీటీ వేశాను. 2020 మార్చి వరకూ బాగానే నడిచింది. కరోనాతో చీటీలు కట్టేవారే కరవయ్యారు. దీంతో పూర్తిగా నష్ట పోవాల్సి వచ్చింది.
వేరే మార్గం లేక చీటీలు వేసిన వారందర్నీ డబ్బులు ఇవ్వాలని వేడుకున్నాం. కానీ ఎవరూ ఇవ్వలేదు. దీంతో చీటీలు నడపలేక పోయాం. చివరగా హౌసింగ్ లోన్ కోసం ఎంతో ప్రయత్నించాం. ప్రొద్దుటూరు, ముద్దనూరు, నగిరి మేనేజర్‌ను అడిగితే కసురుకున్నారు. నలభై లక్షల రుణం వచ్చే ఛాన్స్ ఉంది..కానీ 15 లక్షల రూపాయలు ఇచ్చినా కష్టాలు గట్టు ఎక్కుతాయని మేనేజర్‌లను బతిమిలాడాం.
అప్పు పుట్టలేదు... అవసరం తీరలేదు..ఆర్ధిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. అయినా పిల్లల కోసం చాలా ఓర్చుకున్నాం. కానీ అప్పు ఇచ్చిన కృష్ణారెడ్డి వారం క్రితం బ్యాంకుకు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు. అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో సూసైడ్ ఒక్కటే మార్గమని అనుకున్నాం. అప్పుల వాళ్ల వద్ద ఉన్న ఇంటి పత్రాలు తమ పిల్లలకు చెందేలా చూడాలని కోరుతున్నా.. అమ్మ, నాన్న, వదినా, అత్తలు క్షమించాలి అని గౌరీ తన డైరీలో రాశారు.
గౌరీ బంధువులు ఏం అంటున్నారంటే...??
శివనాగభాస్కర్ రెడ్డి, గౌరీ దంపతుల బలవన్మరణంతో ఇద్దరు చిన్నారులు అనాథలు అయ్యారు. వీరిని గత 17 రోజుల క్రితం మేనత్త ఇంటికి పంపించారని బంధువులు అంటున్నారు. అప్పు విషయమై ఓ వ్యక్తి మానసికంగా వేధింపులకు గురి చేయడం కారణంగానే దంపతులు మృతి చేందారని ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నగిరి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.