అన్నం పెట్టే రైతన్నను కూడా కులాల వారీగా విభజించి ఘనత వైసీపీ(YSRCP) ప్రభుత్వానికి చెందుతుందన్నారు జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan). కౌలు రైతు ఆత్మహత్యలపై బహిరంగ లేఖ రాసిన ఆయన... బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 


అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతును రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు పవన్. రాష్ట్రంలో నిత్యం ఏదో ప్రాంతంలో అన్నదాతల బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు అత్యంత విషాదకరమన్నారు. పల్నాడు జిల్లా మేళ్లవాగుకి చెందిన మేడబోయిన రామకృష్ణ, నంద్యాల జిల్లా హరీవనం గ్రామస్థుడు వెంకటేశ్వరరెడ్డి, కర్నూలు జిల్లా హోసూరుకి చెందిన ఉప్పర తిక్కయ్య అప్పులు భారంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 


ప్రధానంగా కౌలు వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి చట్టబద్దంగా రావాల్సిన పరిహారాన్ని తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు పవన్. ఈ బాధ్యతను నెరవేర్చాల్సిన వ్యవస్థలు, సంబంధిత అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించకూడదని సూచించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం త్రి మెన్ కమిటీ సత్యరమే స్పందించాలన్నారు. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా వ్యవస్థ పనిచేయాలని అభిప్రాయపడ్డారు. 


ప్రతి రైతు కుటుంబానికి రూ. 50వేలు చొప్పున పంట పెట్టుబడి ఇస్తామని వైసీపీ నాయకత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు పవన్. ఆ మేరకు ప్రచారం చేశారన్నారు. ఇప్పటి వరకు ఎన్ని రైతు కుటుంబాలకు రూ. 50 వేలు చొప్పున పంట పెట్టబడి ఇచ్చారో చెప్పాలని డిమాం

డ్ చేశారు. అసలు ఆ హామీ ఏమైందని నిలదీశారు. 


రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వ విఫలమవుతోంది మండిపడ్డారు పవన్.  పంట అమ్ముకున్న తర్వాత సొమ్ములు చేతికి రాకపోవడం, తదుపరి పంటకు పెట్టబడి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కౌలు రైతులకు బ్యాంకులు, సహాకార సంఘాల నుంచి రుణాలు అందడం లేదని దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. వారి వద్ద తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వివరించారు. 






వైసీపీ ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో బాధ్యత తీసుకోరు.. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించడం, పండిన పంట తీసుకొని కూడా డబ్బులు ఇవ్వడం లేదన్నారు జనసేనాని. ఏ దశలోనూ రైతులకు వైసీపీ అండగా నిలబడటం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం అన్నం పెట్టిన రైతలకు కూడా కులాలవారీగా విభజించిందని కామెంట్ చేశారు. 


కౌలు రైతు కుటుంబాలను ఆదుకునే దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తోందని తెలిపారు పవన్. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్లో ప్రతి ఒక్కరికీ రూ. 7 లక్షల పరిహారం అందేలా పోరాడుతుందన్నారు. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పక్షాన భరోసా కల్పిస్తామన్నారు పవన్ కల్యాణ్.