AP SSC 2023 Exam: పదో తరగతి విద్యార్థి తొలిరోజు పరీక్షకు వెళ్లాడు. బాగా చదువుకొని వెళ్లినా పిల్లలు కాస్త టెన్షన్ పడడం మామూలే. కానీ ఆ విద్యార్థి ధైర్యంగా లోపలికి వెళ్లినప్పటికీ అక్కడి పాఠశాల సిబ్బంది అతడిని విపరీతంగా టెన్షన్ పెట్టారు. తాను రాయాల్సింది తెలుగు పేపర్ అయితే సంస్కృతం ప్రశ్నాపత్రం ఇచ్చి ఇబ్బంది పెట్టేశారు. బాలుడు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నీకిదే ప్రశ్నాపత్రం వచ్చిందంటూ వాదించారు. చివరకు విద్యాశాఖ అధికారులు పరీక్షను తర్వాత రాపిస్తామని హామీ ఇవ్వడంతో బాలుడు కాస్త ఆగాడు. అయితే ఆ పరీక్షను నేడు రాయించారు. కానీ ఈరోజు కూడా తెలుగు ప్రశ్నాపత్రానికి బదులుగా సంస్కృతం ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. ఈరోజు కూడా సేమ్ సీన్ రిపీట్ చేశారు. చివరకు పరీక్ష రాయకుండానే బాలుడు వెనక్కి వచ్చేశాడు. 


అసలేం జరిగిందంటే..?


అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో పదో తరగతి పరీక్ష రాస్తున్న అజిత్ కుమార్ కు రెండోసారి కూడా సంస్కృతం ప్రశ్నాపత్రమే అందించారు. రెండు వారాల క్రితం తెలుగు పరీక్ష రాసిన నిజవల్లి గ్రామానికి చెందిన అజిత్ కుమార్.. తెలుగు పేపర్ కు బదులుగా సంస్కృతం ప్రశ్నాపత్రం అందించి సంబంధిత బాలుడిని ఇబ్బంది పెట్టారు. ఆరోజు అధికారులను ప్రశ్నించగా.. పరీక్షల చివరి రోజు తెలుగు పేపర్ రాయిస్తామని చెప్పారు. కానీ రెండోసారి అంటే ఈరోజు కూడా నిర్వహించిన పరీక్షలో సంస్కృతం పేపర్ ఇచ్చి తన కొడుకు భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని తండ్రి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు చేసిన తప్పుకు తన కుమారుడి భవిష్యత్తు ఏమవుతుందోనని విపరీతంగా టెన్షన్ పడుతున్నాడు.