AP Sadhu Parishad Protest
తిరుపతి : నాస్తికుడు, క్రైస్తవ మత ఆచారం ప్రకారం కుమార్తె పెళ్లి చేసిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డిని టిటిడి ఛైర్మన్ గా నియమించారని ఆరోపిస్తూ ఏపీ సాధుపరిషత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం వద్ద సేవ్ తిరుమల - సేవ్ టిటిడి అంటూ ధర్నా నిర్వహించారు. నడక మార్గాల్లో ఆంక్షలు సరైనవి కాదని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డికి వినతి పత్రం అందించాలని చూడగా సాధుపరిషత్ ను టిటిడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, సాధుపరిషత్ సభ్యులకు వాగ్వాదం జరిగింది. అయితే అప్పడే వచ్చి ఏఈవో వాహనంను సాధూపరిషత్ సభ్యులు అడ్డుకున్నారు.
అనంతరం ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు, శ్రీకాకుళానికి చెందిన ఆనంద ఆశ్రమ పీఠం నిర్వాహకులు శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ.. భక్తితో, విశ్వాసంతో ఉన్న హిందువులను టిటిడి ఛైర్మన్ గా నియమించాలని డిమాండ్ చేశారు.. గతంలో జగన్మోహన్ రెడ్డి హయంలో టిటిడిలో ఎన్నో తప్పులు జరిగాయని ఆరోపించారు. టిటిడి లాంటి ధార్మిక సంస్ధ రాజకీయ పునరావస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు.. వన్యప్రాణుల నుంచి రక్షణ కోసం భక్తులకు చేతి కర్రలు ఇస్తామనడం సరైంది కాదన్నారు. తిరుమల చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు జరగలేదని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భక్తులకు చేతి కర్రలు, నడక మార్గంలో ఆంక్షలు తొలగించకపోతే ఉద్యమం చేయడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు.
టిటిడి ఈవో నిర్లక్ష్యం కారణంగానే బాలికపై చిరుత దాడి చేసి హతమార్చిందని, వేంటనే టిటిడి ఈవోను పదవి నుండి తొలగించాలన్నారు.. ఐఏఎస్ కానీ అధికారిని టిటిడి ఈవో స్ధానంలో కూర్చోబెడితే ఏం నిర్ణయాలు తీసుకుంటారని, దీని వల్ల తిరుమలకు విచ్చేసే భక్తులకు హాని జరుగుతుందృ గానీ మెలు జరుగదన్నారు.. ఇక టిటిడి అనాలోచిత నిర్ణయాల కారణంగా శ్రీవారి భక్తులను మరింత ఇబ్బందుల్లోకి తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు..
తిరుమలలో భక్తులకు చేతికర్రలు, కాలినడక భక్తులందరికీ ప్రయోగాత్మకంగా..
తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గాల్లో వన్యమృగాల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వన్యమృగాల దాడిలో లక్షిత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ, భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్య అటవీ శాఖ అధికారులతో ఇటీవల సమావేశం అయ్యింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో చిన్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతించేలా చర్యలు చేపట్టింది.
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్నపిల్లలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. రాత్రి పది గంటల వరకూ పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఉంటుందని పేర్కొంది. నడక మార్గంలో వెళ్ళే ప్రతి భక్తుడికి చెప్పినట్లుగానే ప్రయోగాత్మకంగా ఊతకర్రలు ఇచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం తిరుమలకు భక్తులు నడక మార్గంలో వెళ్లే భక్తులకు అకస్మాత్తుగా జంతువులు కనిపిస్తే వాటి నుంచి రక్షణ పొందేందుకు ఈ ఊత కర్ర ఇస్తున్నారు. ప్రతి భక్తుని చేతిలో కర్రను ఇచ్చి జాగ్రత్తలు చెప్తున్నారు. కానీ కర్రలతో భక్తులు నిజంగానే వన్య మృగాల బారిన పడకుండా రక్షణ పొందవచ్చా అనే అనుమానాలు సైతం భక్తులు లేవనెత్తారు. అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్ళే ద్విచక్ర వాహనదారులకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు వరకే అనుమతిస్తామని స్పష్టం చేసింది. భక్తుల భధ్రత దృష్ట్యా ఎంత మందినైనా అటవీ శాఖా సిబ్బందిని నియమించింది. భక్తులను గుంపులుగా నడక మార్గంలో పంపేందుకు నిర్ణయం తీసుకుంది.