టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏమి చేయలేదని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు అప్పుల్లో ముంచి భ్రష్టు పట్టించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంట్లో సోదాలు చేస్తే దాదాపు రూ.118 కోట్ల రూపాయలు నల్లధనం దొరికిందన్న ఆమె టీడీపీ హయాంలో ఇచ్చిన కాంట్రాక్ట్ పనుల్లో దొంగ బినామీల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ పై సీబీఐ విచారణ చేయించి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. 


సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మొక్కులు చెల్లించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ని తాము ఎప్పుడూ విమర్శించలేదని, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వచ్చినపుడు ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందని చెప్పామని అన్నారు. చంద్రబాబు నాయుడుకి ఓటు వేసి గెలిపించాలని చెప్పడంపైనే అభ్యంతరం అని స్పష్టం చేశారు. ఇండియాలోనే ఏపీని నెంబర్ వన్ స్థానానికి తీసుకొస్తారని రజనీకాంత్ చెప్పడాన్ని ఖండించామన్నారు.


చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి రజనీకాంత్ మాట్లాడితే రజనీకాంత్  ఇమేజ్ తగ్గుతుందన్నారు రోజా. తమిళనాడులో ఎవరినో ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడితే దానిపై జనసైనికులు, టిడిపి వాళ్లు కలిసి ట్రోల్స్ చేశారని మండిపడ్డారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇల్లు లేవన్నారు. హైదరాబాద్ నుంచి నుంచి అప్పుడప్పుడు వచ్చి వైసీపీ నాయకులపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ గ్రామాలకు వెళ్లి మొరుగుతున్నాడని, ప్రతి ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీని తీసుకున్న పవన్ కళ్యాణ్ ఊగిపోతూ మాట్లాడుతున్నారని విమర్శించారు.  


చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ తో విమర్శలు చేస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడం లేదని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ పై సీబీఐ విచారణ చేయించి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ను సైతం సీబీఐ అధికారులు విచారించాలన్నారు రోజా.