Makar Sankranti 2024: తిరుపతి: ఏపీ మంత్రి రోజా నగరిలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భర్త సెల్వమణి, పిల్లలతో కలిసి భోగి వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏపీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో కొత్త వెలుగు రావాలని ఆకాంక్షించారు. వేడుకల అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు నాన్ లోకల్ నేతలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


ఏపీకి వచ్చిన నాన్ లోకల్ నేతలు.. 
సంక్రాంతి అనగానే హైదరాబాద్ లో ఉన్నవారు ఏపీకి వస్తారని చెప్పారు. వీరితో పాటు నాన్ లోకల్ రాజకీయ నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు విజయవాడ చేరుకొని భోగి సంబరాలు చేసుకున్నారని సెటైర్లు వేశారు. వైసీపీ పార్టీకి సంబంధించిన ఫొటోలు, కార్డులను నాన్ లోకల్ పొలిటీషియన్స్ తగలబెట్టారు అంటే ప్రజలు నవ్వుతున్నారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కనుక 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూశారని వ్యాఖ్యానించారు.  


మళ్లీ జగనే సీఎం అవుతారన్న మంత్రి రోజా 
2019లోనే ఆ పార్టీలను ప్రజలు తగులబెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగిలిన దాన్ని 2024లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీలను, వారి మేనిఫెస్టోను పూర్తిగా తగులపెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు జగన్ అన్న వన్స్ మోర్ అంటున్నారని చెప్పారు. ప్రతి కుటుంబానికి కావాల్సిన విద్య, వైద్యం, సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలోని రైతులు, మహిళలు జగన్ సుపరిపాలనలో దర్జాగా బతుకుతున్నారని పేర్కొన్నారు. జగన్ మళ్లీ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కనుక నాన్ లోకల్ పొలిటిషన్స్ చంద్రబాబు, పవన్ కళ్యాన్ ఏదో చెప్తే ప్రజలు నమ్మేస్తారు అంటే కేవలం అది వారి భ్రమ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా మరోసారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగన్ ను మరోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చారు.