Sri Sathyasai District: పుట్టపర్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ప్రధాని మోదీ (PM Narendra Modi) పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. పాలసముద్రంలోని నాసిన్ కేంద్రం వద్ద హెలిప్యాడ్, వాహనాల రాకపోకల, పలు ఏర్పాట్లపై అడ్వాన్స్ సెక్యూరిటీ లాంచ్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి కార్యాలయం భద్రత అధికారులు పీకే యాదవ్, డీఈజీ అమ్మిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి, ఎస్ పి జి అధికారులు, జిల్లా అధికారులు, మోదీ పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
అనంతరం కలెక్టరేట్లోని స్పందన మీటింగ్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యల తీసుకోవాలని.. పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 16న మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రం చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటనలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రులు పాల్గొనే అవకాశం ఉందని.. తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భద్రత, రవాణా, వసతి, వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
రెవెన్యూ శాఖ సమన్వయంతో అవసరమైన చోట్ల స్వాగత తోరణాలు సహా ఇతర హోర్డింగులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున అన్ని రకాల అత్యవసర వైద్య సౌకర్యాలతో కూడిన వైద్య బృందాలను, సరిపడిన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఐదు అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ఫైర్ వాహనములను కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పుట్టపర్తి ఎయిర్ పోర్ట్, నాసిన్ హెలిపాడు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో బార్కెట్లు పటిష్టంగా ఉండాలని తెలిపారు. నిరంతర విద్యుత్ సౌకర్యం ఉండాలని, నాసిన్ కేంద్రం వద్ద బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ అందుబాటులో ఉంచాలన్నారు. నాసిన్ కేంద్రం వద్ద జిల్లా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి జిల్లా అధికారుల తరపున పాస్ లు జారీ చేయాలని డిఆర్ఓ ను, పుట్టపర్తి ఆర్డీవోను ఆదేశించారు.
ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్..
16న మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం చేరుకుని అక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డెరక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(NACIN)ను సందర్శిస్తారు. ఆ భవనం మొదటి అంతస్తులో గల యాంటీక్యూస్ (Antiques) స్మగ్లింగ్ స్టడీ సెంటర్ ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్ ను సందర్శిస్తారు. వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు.
అనంతరం ప్రధాని మోదీ గ్రౌండ్ ఫ్లోర్ లోని ఎక్స్- రే,బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. తదుపరి ఎకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలను నాటి అక్కడ కనస్ట్రక్సన్ కార్మికులతో మాట్లాడి వారితో గ్రూపు ఫొటో దిగుతారు. అనంతరం 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో మాటామంతీలో పాల్గొంటారు. అనంతరం పబ్లిక్ ఫంక్షన్‌లో ప్రధాని మోదీ పాల్గొని ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. తదుపరి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరక్ట్ టాక్టెస్ అండ్ నార్కోటిక్స్ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్ ను అందిస్తారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించాక.. అక్కడి నుండి ఢిల్లీకి బయలుదేరి వెళతారు అని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి అధికారులు తెలిపారు.