TTD AP Highcourt :   తిరుమల తిరుపతి దేవస్థానం  (TTD) నిధులను తిరుపతిలో రహదారులు, పారిశుద్ధ్యం కోసం  మళ్లించడంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారంటూ  బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు . దీనిపై ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. టీటీడీ చర్యలు దేవాదాయ చట్టం సెక్షన్   111కు విరుద్ధమని.. రూ. వంద కోట్లు శ్రీవారి సొమ్ము  తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మళ్లించారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.  గతంలో ఎప్పుడూ తితిదే నిధులు మళ్లించలేదన్నారు.  


టెండర్లు ఖరారు చేసుకోవచ్చు కానీ నిధుల విడుదల వద్దు !     


వాదనలు విన్న న్యాయస్థానం పారిశుద్ధ్య పనులకు నిధులు విడుదల చేయొద్దని  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.   టెండర్‌ ప్రక్రియ కొనసాగించుకోవచ్చు కానీ నిధులు మాత్రం విడుదల చేయవద్దని స్పష్టం చేసింది.  రెండు వారాల్ గా కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీ , తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది .


ఏటా రూ. వంద కోట్లు రిలీజ్ చేసేందుకు  అంగీకారం               


తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను తిరుపతి కార్పొరేషన్‌లోని రోడ్లు, కాలనీల పారిశుధ్యం పనులకు వినియోగించాలని ఇటీవల నిర్ణయించారు.  ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ఈవో ఆమెదం తెలుపుతూ పనుల నిర్వహణకు టెండర్లు పిలిచారు.  పారిశుధ్య పనులు నిమిత్తం ఈ ఏడాది నవంబరు 22న టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. బిడ్లు స్వీకరించేందుకు డిసెంబరు 7ను చివరి తేదీగా పేర్కొన్నారు. డిసెంబర్   16న జరిగే బోర్డు మీటింగ్‌లో బిడ్లు ఖరారు చేసే అవకాశం ఉంది.  వెంటనే ఈ ప్రక్రియను నిలిపివేయాలని భానుప్రకాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 


గతంలోనూ ఇలాంటి ఆదేశాలు ఇచ్చి కోర్టులో పిల్ దాఖలు కావడంతో ఉపసంహరించుకున్న టీటీడీ                   
 
భక్తులు ఇచ్చే కానుకలు, నిధులపై ఆధారపడి టీటీడీని నిర్వహిస్తున్నారు. దేవదాయ చట్టంలోని సెక్షన్‌ 111ను అనుసరించి నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.  టీటీడీ నిర్వహణ, భక్తుల సంక్షేమం, హిందూ ధర్మం కోసమే సొమ్మును వినియోగించాలి. ఇతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదు. తిరుపతి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే 200 అడుగుల రహదారి సుందరీకరణ, లైటింగ్‌ ఏర్పాటు కోసం టీటీడీకి చెందిన రూ.10 కోట్లు విడుదలకు గతంలో ఈవో అనుమతివ్వగా హైకోర్టులో పిల్‌ దాఖలైంది. వ్యాజ్యంలో పెండింగ్‌లో ఉండగానే ఈ నిర్ణయాన్ని టీటీడీ ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో నిధుల విడుదలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో  టీటీడీ ఏం చేయబోతోందన్న ఆసక్తి ఏర్పడింది. 


గతంలో ఒక శాతం టీటీడీ నిధుల్ని తిరుపతి అభివృద్ధికి కేటాయించాలన్న తీర్మానాన్ని చేశారు. రాజకీయ దుమారం రేగడంతో ప్రభుత్వం అంగీకరించలేదు. దొడ్డిదోవన ఇలా ఖర్చు పెడుతున్నారన్న విమర్శలు విపక్షాలు  చేస్తున్నాయి.