Assembly Election 2024: పూతలపట్టు... చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి కొలువైన నియోజకవర్గం. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కూడా. అక్కడ ఆధిపత్యం కోసం వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) ఆరాటపడుతుంటే... ఉనికి కోసం టీడీపీ (TDP) పోరాడుతోంది. ఈ రెండు పార్టీల నుంచి డాక్టర్లనే అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దింపారు. అందులో ఒకరు... రోగుల నాడిని పరీక్షించే డాక్టర్. మరొకరు... ప్రజల పల్స్ తెలిసిన పీహెచ్‌డీ డాక్టర్. వీరిద్దరిలో గెలుపు ఎవరిది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇద్దరు డాక్టర్ల మధ్య పోటీ
రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఏర్పడింది. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పుడు జరుగుతున్నవి నాలుగో ఎన్నికలు. ఈ నాలుగు ఎన్నికల్లోనూ డాక్టర్లకే పట్టంకట్టారు పూతలపట్టు ఓటర్లు. దీంతో... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కూడా ఈసారి.. డాక్టర్లనే బరిలోకి దింపాయి. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి డాక్టర్ సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. ఆయన వృత్తి రీత్యా వైద్యుడు. రోగులు నాడి పట్టి... వైద్యం చేస్తాడు. ఇక... టీడీపీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కలికిరి మురళీమోహన్... వృత్తి రిత్యా జర్నలిస్టు. ఆయన పీహెచ్‌డీ చేసి డాక్టర్ పట్టా పొందారు. ప్రజల నాడి, ప్రజా సమస్యలపై బాగా తెలిసిన వ్యక్తి. ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరు డాక్టర్ల మధ్యే సమరం జరుగుతోంది.
గత రెండు ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీదే అధికారం
పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడ్డాక 2009లో మొదటి ఎన్నికలు జరిగాయి. అప్పుడు... కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పి.రవి గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో డాక్టర్.సునీల్ కుమార్.. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే... ఆయనపై పలు ఆరోపణలు రావడంతో.. వైసీపీ కేడర్ నుంచి సహకారం లభించలేదు. దీంతో... 2019 ఎన్నికల్లో డాక్టర్.సునీల్ కుమార్‌ను పక్కన పెట్టి... ఎంఎస్ బాబుకు అవకాశం ఇచ్చింది వైసీపీ. ఆ ఎన్నికల్లో ఎంఎస్ బాబును గెలిపించి వైసీపీకి మరోసారి అవకాశం ఇచ్చారు పూతలపట్టు ప్రజలు. ఈసారి... పాత ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్‌కు అవకాశం ఇచ్చింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీలో చేరి... ఎన్నికల బరిలో దిగారు.
పూతలపట్టులో ఓటర్ల సంఖ్య
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మూడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలతో పోలిస్తే... పూతలపట్టులోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో లక్షా 99వేల 405 మంది ఓటర్లు ఉన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో 2లక్షల 2వేల 771 మంది ఓటర్లు ఉన్నారు. పూతలపట్టులో ఐదు మండలాలు ఉన్నాయి. 2లక్షల 15వేల 183 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది దళిత ఓటర్లే. 50 నుంచి 55 శాతం దళిత ఓటర్లు ఉంటారు. వీరిలో కూడా... అరవ మాల సామాజిక వర్గానికి చెందిన వారిదే కీలకపాత్ర. వారి సంఖ్య 30 నుంచి 35 శాతం ఉంటుందని అంచనా. పది నుంచి 15 శాతం తెలుగు మాల సామాజిక వర్గం ఓటర్లు ఉంటారు. వీరే నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తారు
2009 నుంచి 2019 ఎన్నికల వరకు...
2004 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన లలిత కుమారి.. 2009 ఎన్నికల్లో పూతలపట్టు నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవికుమార్‌పై 950 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవికుమార్‌కు 64,484 ఓట్లు వచ్చాయి. ఇక... 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు 83,200 రాగా... లలిత కుమారి 902 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబు గెలిచారు. ఆయనకు లక్షా 3వేల 265 ఓట్లు రాగా... టీడీపీ అభ్యర్థి లలిత కుమారికి 74,102 ఓట్లు మాత్రమే వచ్చాయి.
రాష్ట్ర విభజన ముందు జరిగిన చివరి ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. విభజన తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ జెండానే ఎగిరింది. గత మూడు ఎన్నికల్లోనూ... టీడీపీ పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. నాలుగోసారి అయిన టీడీపీ విజయం సాధిస్తుందా... లేక గత ఫలితాలే రిపీటై వైఆర్‌ఎస్‌సీపీకే మళ్లీ అధికారం లభింస్తుందా.. అన్నది అక్కడి ప్రజలే నిర్ణయించాలి.