AP Election 2024 Fight between Krupalakshmi and Ramesh babu in Gangadhara Nellore: జీడీ నెల్లూరు నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా వైసీపీ ప్రకటించడంతో కొంత అసంతృప్తి వ్యక్తం కావడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో నారాయణ స్వామి ఎన్నికల నుంచి తప్పుకుని తన కుమార్తె కృపా లక్ష్మికి సీటు కోసం ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.
కన్నీళ్లు పెట్టుకున్న నారాయణ స్వామి
గత 10 సంవత్సరాలుగా నారాయణ స్వామి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడిన దానిపై చర్చ జరిగేది. అలాంటి వ్యక్తి ఈసారి పోటీ నుంచి తప్పుకుని తన కుమార్తె విజయం కోసం కృషి చేస్తున్నారు. అభ్యర్థి ప్రకటన అనంతరం పార్టీ వర్గాలలో అసంతృప్తి వ్యక్తం కావడంతో తన అనుచరులతో, పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ కేడర్ తన కుమార్తె కృపా లక్ష్మికి సహకరించాలని, ఇకపై నాన్న, అన్న, తమ్ముడు, అంతా వీళ్ళే... నా కుమార్తె గెలుపించే బాధ్యత మీదే.. ఎప్పుడు బయటకు రాని నా కూతురు ప్రజల కోసం వచ్చింది అంటూ విలపించారు. దీంతో తన మద్దతుదారులు శాంతించి ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో నారాయణ స్వామి గెలుపు కోసం పని చేసిన విజయానంద రెడ్డిని సైతం చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది.
మరదలుపై బావ పోటీ..!
డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి స్వయానా చెల్లెలు కొడుకు రమేష్ బాబు ఈసారి ఆయనకు వ్యతిరేకంగా పని చేయనున్నారు. గత ఎన్నికల్లో నారాయణ స్వామి గెలుపు కోసం పని చేసిన ఆయన తొలిసారి వ్యతిరేకత చూపుతున్నారు. నారాయణ స్వామి వెంట నడిచిన వ్యక్తిగా సీటు ఆశించినా, తనకు రాకపోవడంతో తన వర్గం వారితో చర్చించిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ తరుణంలో జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా ఈసారి రమేష్ బాబు పోటీ చేస్తున్నారు.
ఎవరికి సపోర్ట్ చేస్తారో..
నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు తమ తమ మద్దతు దారులకు ఎవరికి సపోర్ట్ చేయాలో తేల్చుకోలేక పోతున్నారు. నాయకులు నిన్నటి వరకు ఏ పని కావాలన్నా అడిగి చేసుకున్న రమేష్ బాబు ఒక వైపు... సీనియర్ నేత, ఎమ్మెల్యే నారాయణ స్వామి కుమార్తె కావడంతో ఎటువైపు నిలవాలో తేల్చుకోలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కొందరు మాత్రం వైసీపీ అభ్యర్థి వెంటే కొనసాగుతూ మరోసారి పార్టీని గెలింపించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.