South Central Railway Special Trains: వేసవి ప్రయాణికులతో రైళ్లు ఫుల్ అయిపోయాయి. ఏ ట్రైన్ చూసినా డిక్లైన్ చూపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైన్‌లో వెళ్లడమంటే సాహసమే అని చెప్పాలి. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్స్‌ వేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 


రైల్వే ప్రయాణీకులు తాకిడి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచారు. 15 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. వేసవిలో పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు మే ఒకటో తేదీ నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు షెడ్యూల్‌ వారీగా రాకపోకలు కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు. పాట్నా - సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ - పాట్నా, దనపూర్‌ - సికింద్రాబాద్‌, దనపూర్‌ - బెంగుళూరు వంటి స్టేషన్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రైళ్లు, రిజర్వేషన్‌ వివరాలకు ఎస్‌సీఆర్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. 


ప్రయాణీకులకు ఎంతో మేలు


దక్షిణ మధ్య రైల్వే అధికారులు అదనంగా ఏర్పాటు చేస్తున్న రైళ్ల వల్ల ప్రయాణీకులకు ఎంతో మేలు కలుగనుంది. వేసవి సెలవులు నేపథ్యంలో అనేక ప్రాంతాలకు, టూర్లకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల ఇబ్బందులను గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. అదనంగా 15 రైళ్లను నడపాలని నిర్ణయించడం వల్ల వేలాది మంది ప్రయాణీకులు సాఫీగా ప్రయాణం సాగించేందుకు అవకాశం కలుగుతుంది. ప్రతిరోజూ వందలాది మంది ఆయా ప్రాంతాలు గుండా ప్రయాణాలు సాగించడానికి అనువుగా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు.