IPL 2024 RCB vs SRH head to head Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL) మ్యాచ్‌ 30లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తలపడనున్నాయి. వరుస పరాజయాలతో  బెంగళూరు ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచి రెండు కీలకమైన పాయింట్లను సంపాదించాలని హైదరాబాద్ చూస్తోంది. 


హెడ్‌ టు హెడ్ రికార్డులు ఇలా..
 ఐపీఎల్‌లో ఇప్పటివరకూ బెంగళూరు, హైదరాబాద్‌ 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ 12 విజయాలు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. చిన్నస్వామి స్టేడియంలో  హైదరాబా‌ద్‌-బెంగళూరు జట్లు మొత్తం ఎనిమిది మ్యాచుల్లో తలపడ్డాయి, అందులో హైదరాబాద్‌ కేవలం రెండే మ్యాచులు గెలవగా... బెంగళూరు అయిదు మ్యాచుల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. హైదరాబాద్‌లో ఇరు జట్లు 8 మ్యాచుల్లో తలపడగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు గెలవగా... బెంగళూరు రెండు గెలిచింది. 


పిచ్‌ రిపోర్ట్‌
చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీలు బ్యాటర్లకు కలిసి రానున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో ఎక్కువగా అత్యధిక స్కోరింగ్ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రెండో బ్యాటింగ్ చేసిన జట్లు 47 సార్లు గెలుపొందగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 37 సార్లు గెలిచింది. 


మరికొన్ని రికార్డులు...
ఐపీఎల్‌లో హైదరాబాద్‌పై విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు నమోదు చేశాడు. కోహ్లీ 21 ఇన్నింగ్స్‌లలో 35.21 సగటు, 139.67 స్ట్రైక్ రేట్‌తో 669 పరుగులు చేశాడు, ఇందులో నాలుగు అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. హైదరాబాద్‌పై RCB తరపున యుజ్వేంద్ర చాహల్ అత్యధిక వికెట్లు పడగొట్టాడు. 16 మ్యాచ్‌ల్లో ఈ స్టార్ స్పిన్నర్ 17 వికెట్లు పడగొట్టాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక పరుగులు 227. ముంబైలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌.... బెంగళూరును కేవలం 68 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 


భీకరంగా హైదరాబాద్‌ బ్యాటర్లు
సన్‌రైజర్స్‌ బ్యాటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. హైదరాబాద్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్ 186, అభిషేక్ శర్మ 177 పరుగులతో  టాప్-10 పరుగుల బ్యాటర్ల జాబితాలో ఉన్నారు. ట్రావిస్ హెడ్ 133 పరుగులతో పర్వాలేదనిపిస్తున్నాడు. వీురు మరోసారి బ్యాట్‌ ఝుళిపిస్తే అసలే కష్టాల్లో ఉన్న బెంగళూరు బౌలర్లు మరోసారి ఊచకోతకు గురికావడం ఖాయం. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. 


బెంగళూరు జట్టు( అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, రీస్ టాప్లీ, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ 



హైదరాబాద్‌ జట్టు(అంచనా): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, T నటరాజన్