IPL 2024 RCB vs SRH Preview and Prediction : వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB).. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) తో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. బౌలింగ్‌ వైఫల్యంతో వరుసగా విఫలమవుతున్న బెంగళూరు.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించి భీకరంగా ఉన్న హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌ ఐపీఎల్‌లో విజయాల బాట పట్టాలని బెంగళూరు పట్టుదలగా ఉండగా.. బెంగళూరుపైనా విజయం సాధించి ప్లే ఆఫ్‌కు అవకాశాలు మరింత పెంచుకోవాలని హైదరాబాద్‌ భావిస్తోంది. దిగ్గజ ఆటగాళ్లు, నాణ్యమైన కోచ్‌లు ఉన్నా ఎందుకు ఓడిపోతున్నామో తెలియక బెంగళూరు సతమతమవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయంతో సమస్యలు అన్నింటికీ చెక్‌ పెట్టాలని ఆర్సీబీ చూస్తోంది.


 

బెంగళూరు పుంజుకుంటుందా..?

విజయం కోసం బెంగళూరు రచించిన ప్రణాళికలు ఏవీ ఈ ఐపీఎల్‌లో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. కేవలం ఒకే విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ ఐపీఎల్‌లో బౌలింగ్‌ వైఫల్యం బెంగళూరు విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసింది. బ్యాటర్లు 200 పరుగులు చేస్తున్నా బౌలర్లు ఆ పరుగులను కాపాడుకోలేక పోతున్నారు. ఈ మ్యాచ్‌లో అయినా బౌలర్లు పుంజుకుంటారేమో చూడాలి. సాధారణంగా ఇతర జట్ల బౌలర్లు స్లో బాల్స్‌.. స్లో బౌన్సర్లు సహా భిన్నమైన బంతులతో బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. కానీ బెంగళూరు బౌలర్లు సాధారణ బౌలర్లుగా మారిపోయారు. బెంగళూరు బౌలర్లను ప్రత్యర్థి బ్యాటర్లు సునాయసంగా ఎదుర్కొంటున్నారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు 196 పరుగులు చేశారు. ఈ లక్ష్యాన్ని ముంబై కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు బౌలర్లను ఉతికి పిండి ఆరేసిన ముంబై బ్యాటర్లు.. వాంఖడే స్టేడియంలో  ఓవర్‌కు 13 పరుగుల కంటే ఎక్కువ పరుగులు సాధించారు. వాంఖడేలో షార్ట్ బౌండరీల వల్లే ఇది సాధ్యమైందన్న ఆరోపణలు కేవలం సాకులు మాత్రమే. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్ చేసిన అర్ధశతకాలు కచ్చితంగా RCB ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కానీ గ్లెన్ మాక్స్‌వెల్ ఆరు మ్యాచులు ఆడి కేవలం 32 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు.

 

భీకరంగా హైదరాబాద్‌ బ్యాటర్లు

సన్‌రైజర్స్‌ బ్యాటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. హైదరాబాద్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్ 186, అభిషేక్ శర్మ 177 పరుగులతో  టాప్-10 పరుగుల బ్యాటర్ల జాబితాలో ఉన్నారు. ట్రావిస్ హెడ్ 133 పరుగులతో పర్వాలేదనిపిస్తున్నాడు. వీురు మరోసారి బ్యాట్‌ ఝుళిపిస్తే అసలే కష్టాల్లో ఉన్న బెంగళూరు బౌలర్లు మరోసారి ఊచకోతకు గురికావడం ఖాయం. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. స్పిన్నర్లు షహబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే ఇద్దరూ ఓవర్‌కు 11 కంటే ఎక్కువ పరుగులు ఇవ్వడంతో  హైదరాబాద్‌ను కాస్త కలవరపెడుతోంది. హైదరాబాద్‌ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌ మరింత రాణించాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. కమిన్స్‌ ఓవర్‌కి కేవలం ఏడు పరుగుల కంటే తక్కువ మాత్రమే ఇచ్చాడు. నటరాజన్ 5 వికెట్లుతో పర్వాలేదనిపిస్తున్నాడు. 

 

జట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భండగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్. 

 

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూఖీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్.