Madanapalli News: అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం కాదు ఉద్దేశపూర్వకంగా పలు ఫైల్స్ కాల్చి ప్రమాదంగా సృష్టించాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రమాదం చేసింది ఎవరు? చేయించింది ఎవరు అంటే మాత్రం త్వరలో అందరి పేర్లు బయట పెడతాము.. కేసులో ఎవరి పాత్ర ఉన్న కటకటాల పాలు కాక తప్పదు అనే రీతిలో వ్యవహరిస్తుంది సీఐడీ.


మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జులై నెల 21వ తేదీ అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. 22న ఉదయానికి ఆ విషయాన్ని అంతా ప్రమాదంగా భావించారు. అసెంబ్లీ తొలి రోజు కావడంతో రాష్ట్ర ప్రజలు ఆలోచన అంతా అమరావతి వైపు ఉంది. మదనపల్లి ప్రమాదాన్ని ఉదయం 10 గంటల వరకు సాధారణ ప్రమాదం అనేలా వార్తలు కూడా ప్రసారం అయ్యాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు రాష్ట్ర ఉన్నతాధికారులను ఘటన స్థలానికి పంపి విచారణ చేపట్టారు. రాష్ట్ర సీఐడీ చీఫ్, డీజీపీని మదనపల్లికి ప్రత్యేక హెలికాప్టర్‌లో పంపడంతో ఇదేదో పెద్ద విషయం అనేలా మారింది. రాత్రి వరకు విచారణ చేసిన ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి ఊహించిన విధంగా కార్యాలయంలో జరిగింది ప్రమాదం కాదు.. ఉద్దేశపూర్వకంగా చేసారని తెలుస్తోందని మీడియా సమావేశం లో సైతం మాట్లాడారు.



దూకుడు పెంచిన సీఐడీ
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాద ఘటనను సీరియస్‌ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ కి కేసు అప్పగించింది. సీఐడీ అధికారులు తొలిరోజు నుంచి వివిధ దేశాల్లో విచారణ వేగవంతం చేశారు. అసలు ఏ రోజు ఏమి జరిగింది... సీసీ కెమెరాలు ఎన్ని రోజులుగా పని చేయడం లేదు... ఆదివారం అయిన ఉద్యోగి ఎందుకు కార్యాలయంలో ఉన్నాడు.. అసలు ఏఏ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు... వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ప్రభుత్వ భూములు ఉన్నాయా.. లేదా... లేకుంటే ఎవరిపైకి మార్చారు.. ఎలా మార్చారు అనే అంశంపై విచారణ చేసారు. ఇందులో వైసీపీ నాయకులతో పాటు కొందరు జర్నలిస్టులు సహా పలువురిని విచారణ చేసి వారి ఇళ్లను పరిశీలించి పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం రాత్రి మదనపల్లికి సీఐడీ ఏఎస్పీ రాజ్ కమల్, డీఎస్పీ వేణుగోపాల్ వచ్చారు. ఇప్పటికే నిమ్మనపల్లి వీఆర్ఏ రమణయ్య సహా సబ్ కలెక్టర్ కార్యాలయం ఉద్యోగి గౌతమ్ తేజ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కేసులో ఉన్న మరికొందరు కూడా విచారణకు రావాలని సూచించారని తెలుస్తోంది. మంగళవారం మదనపల్లి కి సీఐడీ చీఫ్ రానున్నారు.


Also Read: ఎగ్‌ పఫ్‌లు బాగా తిన్నట్టున్నారు- వైసీపీ మద్దతుదారునికి ఇచ్చిపడేసిన సాయిధరమ్‌తేజ్


స్వాధీనం చేసుకున్న ఫైల్స్ లో ఏముంది..


మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం లో పలు కీలక ఫైల్స్ దగ్థమైనాయి. ఇందులో విచారణ కు సంబంధించి పలువురు వైసీపీ సహా జర్నలిస్టు ఇళ్లను పరిశీలించి పలు కీలక ఫైల్స్, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు వద్ద ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వేదికగా జరిగిన వివిధ రకాల భూముల కుంభకోణంతో పాటు మద్యం పాలసీకి సంబంధించిన వివరాలు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే సీఐడీ అధికారులు ఎలా వ్యవహరిస్తారు.. మద్యం విషయంపై దృష్టి సారిస్తారా లేక ప్రమాదం పై వివరాలు వెల్లడిస్తారు... కేసులో ఎవరినైనా అరెస్టు చేస్తారా... ఒక వేళ అరెస్ట్ చేస్తే ఎవరి మెడకు ఉచ్చు బిగిస్తుంది... వైసీపీ పెద్దలను ఇందులో బాధ్యులను చేస్తారా.. కేవలం అధికారులను బలి చేస్తారా అనేది ఆసక్తి నెలకొంది.


Also Read: ఏపీలో తేలని నామినేటెడ్ పోస్టులు - కూటమి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదా ?