Anantapur News: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. అధికార పార్టీ తరఫున పలువురు ఉన్నతాధికారులే రంగంలోకి దిగారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగా జిల్లాల్లో ఉపాధ్యాయలతో ఇతర అధికారులతో సమావేశమై ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాయలసీమలో పర్యటిస్తున్న ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి కొందరు నేతలు అడ్డుకోవడం కలకలం రేపింది.
అనంతపురంలో ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి పర్యటన వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. పదో తరగతిలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు, నాడు - నేడ పనుల పర్యవేక్షణకు పర్యటిస్తున్నారని అధికార పార్టీ చెబుతోంది. అయితే ఇదంతా అబద్దమని.... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆయన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై... అధికార పార్టీకి ఓటు వేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నాయి ప్రతి పక్షాలు. అందులో భాగంగానే ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి పర్యటనను అనంతపురంలో విపక్షాకలకు చెందిన కార్యకర్తలు అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి భర్త, విద్యాశాఖ కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ రెడ్డిపై దాడికి యత్నించారని అధికార పార్టీ నేతలు. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులతో మాట్లాడుతుండగా.. టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాల నేతలు ఒక్కసారిగా అక్కడికి వచ్చి ఆయన్ని నిలదీశారు.
ఇంతలో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిని నిలదీసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తనను హత్య చేసేందుకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారని.. పలువురు ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారంతో బయటపడ్డానని కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. తనపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చని.. ఇలా దౌర్జన్యానికి దిగడం అప్రజాస్వామికం అని అన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.