సైబర్ నేరగాళ్ల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. పోలీసులు, ప్రభుత్వం వివిధ రూపాల్లో అవగాహన కల్పిస్తున్నా సరే, ఎంతో మందిని నేరగాళ్లు వలలో వేసుకుంటున్నారు. డబ్బులకు ఆశ పడి ఉన్న సొమ్మును పోగొట్టుకుంటున్నవారి కేసులో రోజూ వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, మోసం జరిగిపోయాక పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఓ ఉన్నతాధికారి వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. అసలే బాధలో ఉన్న తమకు ఊరట కల్పించాల్సిందిపోయి దుర్భాషలాడారని బాధితులు వాపోయారు. ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారే ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సదరు బాధితుడు డీఎస్పీ తీరు గురించి జిల్లా ఎస్పీకి లేఖ రాసి మనస్తాపంతో ఎక్కడికో వెళ్లిపోయారు.
అసలేం జరిగిందంటే..
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొండాపురంలో ఆర్‌ఎంపీగా పని చేస్తున్న జి. వెంకటేశ్ సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకున్నారు. లక్కీ డ్రా పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు ఆయన్ను మోసం చేశారు. డబ్బుకు ఆశ పడ్డ అది ఆయన ట్యాక్సుల పేరుతో సైబర్ నేరగాళ్ల అకౌంట్లలో ఏకంగా రూ.15 లక్షలు జమ చేశారు. తర్వాత మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్నాడు. దీంతో చేసేది లేక జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోవడం లేదని గత సెప్టెంబరు 19న ‘స్పందన’ కార్యక్రమంలో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను కలిశారు. తన గోడు మొత్తం వెళ్లబోసుకున్నారు.
Also Read: Living With The Dead Body: ఏడాదిన్నరగా ఇంట్లోనే శవం, గంగాజలం తాగిస్తూ బతికించే ప్రయత్నం!
వెంటనే ఎస్పీ ఆదేశాల ప్రకారం పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 22న వెంకటేశ్ తాడిపత్రి డీఎస్పీ చైతన్య ముందు హాజరయ్యారు. అయితే, ఇక్కడే తనకు న్యాయం చేయాల్సిన పోలీసులు దుర్భాషలాడారని ఎస్పీ ఫకీరప్పకు బాధితుడు లేఖ రాశారు. డీఎస్పీ తనను అవమానపరుస్తూ.. ‘‘పోయిన డబ్బులు తిరిగి రావు.. పోయి అడుక్కు తినండి’’ అంటూ తిట్టారని ఆరోపించారు. ‘‘రేపు నేను మీ ఇంటికి వస్తాను. నేను, నువ్వు, మీ ఆవిడ కలిసి భజన చేద్దాం’’ అంటూ మాట్లాడారని బాధితుడు లేఖలో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ లేఖలో ఎస్పీని కోరారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు.
కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేశారు. బాధితుడైన వెంకటేశ్ హైదరాబాద్ వెళ్లినట్లుగా గుర్తించారు. జరిగిన సైబర్ నేరం గురించి విచారణ చేసిన పోలీసులు అతడిని మోసం చేసిన నిందితుడిని కూడా గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సెప్టెంబరు 24న కోల్‌కతా వెళ్లారు. ఇప్పటికే సుమారు రూ.2.50 లక్షల వరకు రికవరీ చేసి బాధిత కుటుంబానికి అందజేసినట్లు పుట్లూరు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని మిగతా మొత్తం కూడా రికవరీ చేస్తామని చెప్పారు.
Also Read: Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!