RK Roja Comments On Balakrishna:

  నందమూరి బాలకృష్ణ, ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా సినిమా పరంగా మంచి మిత్రులు. బయట ఈవెంట్లలోనూ ఎంతో సరదాగా ఉంటారు. కానీ రాజకీయాల విషయానికొస్తే విమర్శలు ఏ స్థాయిలోనైనా చేసుకుంటూ తమ అభిమానులకు షాకిస్తుంటారు వీరిద్దరూ. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీల మధ్య వాక్ యుద్ధానికి దారితీసింది. తన తండ్రి ఎన్టీఆర్ పేరు కేవలం పేరు కాదని చరిత్ర అని, ఆత్మగౌరవం, తెలుగువాడి సంస్కృతి అంటూ బాలకృష్ణ స్పందించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 


జ"గన్" రియల్ సింహం..  తేడా వస్తే దబిడి దిబిడే.. 
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ సినిమాలోని డైలాగ్ తో ఆయనకే ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా. ‘బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు... జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ"గన్" అనే రియల్ సింహం..  తేడా వస్తే దబిడి దిబిడే..!!’ అంటూ మంత్రి రోజా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ వైఎస్ జగన్ పై ఈగ వాలినా సహించరు. సీఎం జగన్ పై గానీ, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయంటే కౌంటర్ అటాక్ చేసేందుకు రెడీగా ఉంటే నేతల్లో ఆమె ఒకరు.






టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎన్టీఆర్‌పై చెప్పులేసినప్పుడు నందమూరి కుటుంబం ఎక్కడ పోయిందంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఏపీ మంత్రులు బాలకృష్ణ, ఎన్టీఆర్ సహా నందమూరి కుటుంబసభ్యులను ప్రశ్నించారు. తమ పాలనలోనే హెల్త్ యూనివర్సిటీలు ఎన్నో మంజూరు చేశామని, రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం వైఎస్ జగన్ ఎన్నో చర్యలు తీసుకున్నారని, హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సరైన నిర్ణయమని అధికార పార్టీ నేతలు స్పందించారు. వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు సైతం ఎన్టీఆర్ కోసం నేడు పోరాడటం విడ్డూరంగా ఉందంటూ మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ మంత్రులు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హతగానీ, ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేవని విమర్శించారు. ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవంతోనే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఓ జిల్లాకు దివంగత నేత ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి విడదల రజనీ, సీఎం జగన్ స్పష్టం చేశారు. వైద్య రంగానికి ఎంతో సేవ చేసిన కారణంగానే హెల్త్ యూనివర్సిటీకి దివంగత నేత వైఎస్సార్ పేరు పెట్టామని చెప్పారు.