తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 108 సేవలు నిలిపివేస్తామని 108 ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో108 వాహనాల సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే నవంబర్ 25 నుంచి సేవలు నిలిపి వేస్తామని కిరణ్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో తెలిపారు. తమ సమస్యలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన ప్రయోజనం లేదన్నారు. దాంతో తాము నిరసనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ 108 సంఘ నేతలు మహేష్, రాజేష్, మునిరాజ, కేశవులు, సునీల్, సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాము నిరంతరం శ్రమిస్తామని, కానీ తమ సమస్యలు పరిష్కరించే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజుల్లో కూటమి ప్రభుత్వం వీరి సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సామాన్యుల ప్రాణాలు కాపాడటంలో 108 అంబులెన్సులు విశేషంగా సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా ప్రజలందరికీ ఉపయోగపడే ఇలాంటి ఎమర్జెన్సీ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండక తప్పదు.