Tirupati Ruia Incident : తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణరెడ్డి ఆదేశాల మేరకు ప్రైవేట్ అంబులెన్స్ దందాపై తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి, డీఎంహెచ్ఓ, డీఎస్పీ బృందం విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిని విచారించిన బృందం జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించింది. రుయాలో అంబులెన్స్ మాఫియా నిజమేనని తేలింది. అయితే విచారణ బృందం సమర్పించిన నివేదికను పరిశీలించిన కలెక్టర్ వెంకటరమణరెడ్డి రుయా సూపరింటెండెంట్ భారతి, ఆర్.ఎంవో సరస్వతీ దేవిని బాధ్యులను చేస్తూ సూపరింటెండెంట్ కి షోకాజ్ నోటీస్ జారీ చేయగా, ఆర్.ఎం.వోను సస్పెండ్ చేశారు. అంతే కాకుండా బాలుడి మృతదేహం తరలింపు విషయంలో అంబులెన్స్ ను అడ్డుకున్న ఆరుగురు అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
అంబులెన్స్ మాఫీయా
గతంలో కూడా ఇలాంటి ఘటనలే అనేకమార్లు తెర మీదకు వచ్చాయి. ఏళ్ల తరబడి రుయా ఆసుపత్రులో ప్రైవేట్ అంబులెన్స్ మాఫీయా పాతుకు పోయింది. రుయా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలపై రోగులు అనేక మార్లు ఆసుపత్రి అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కాదు. డ్రైవర్లు దందాపై సమాచారం అందుకున్న తిరుపతి మాజీ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి నేరుగా రుయా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లుకు వార్నింగ్ ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను వేధింపులకు గురి చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరువాత కొద్ది రోజుల పాటు ధరల పట్టిక పెట్టిన డ్రైవర్లు ఆ తరువాత యథావిధిగా ధర పట్టికని తొలగించి ఇష్టం రాజ్యంగా ఎవరికి తోచినట్లు వారు అమాయకపు ప్రజలను టార్గెట్ చేసుకుని అధికంగా నగదు వసూలు చేసేవారు.
బాధ్యులపై చర్యలకు డిమాండ్
సోమవారం రాత్రి రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనతో మరొకసారి అంబులెన్స్ డ్రైవర్లు ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఓ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రుయా ఆసుపత్రిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి ప్రైవేటు అంబులెన్స్ ను ఆసుపత్రి పరిసరాల్లో కాకుండా, ఆసుపత్రికి బయట పెట్టుకుని, సామాన్యుడి అందుబాటులో ఉండే కచ్చితమైన ధరలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.