Minister Vidadala Rajini : తిరుప‌తి రుయా ఘ‌ట‌న‌పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని స్పందించారు. రుయా ఆస్పత్రి ఘ‌ట‌న‌పై సూప‌రింటెండెంట్ డాక్టర్ భారతి వివ‌ర‌ణ కోరామన్నారు. ఇలాంటి ఘ‌ట‌న దుర‌దృష్టక‌రమన్న మంత్రి, బాధ్యులను వ‌దిలిపెట్టే ప్రస‌క్తే లేదన్నారు. మృత‌దేహాల విష‌యంలో వ్యాపారం చేసిన దోషుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామన్నారు. మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను ప్రైవేట్ వ్యక్తులు బెదిరించారా..? ఆసుపత్రి సిబ్బందే బెదిరింపుల‌కు పాల్పడ్డారా అనే కోణంలో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించామన్నారు. 


మహాప్రస్థానం అంబులెన్స్ లు 24 గంటలు


"రుయా ఘటన విచార‌ణ‌లో ఎవ‌రి త‌ప్పు ఉన్నా వ‌దిలిపెట్టం. క‌ఠినంగా చ‌ర్యలు తీసుకుంటాం. మ‌హాప్రస్థానం అంబులెన్సులు 24 గంట‌లూ ప‌నిచేసేలా త్వర‌లోనే ఒక విధానాన్ని తీసుకొస్తాం. ప్రీపెయిడ్ ట్యాక్సీల విష‌యాన్ని ప‌రిశీలిస్తాం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మృత‌దేహాల‌ను వీలైనంత‌ వ‌ర‌కు మ‌హాప్రస్థానం వాహ‌నాల ద్వారానే ఉచితంగా త‌ర‌లించేలా చ‌ర్యలు తీసుకుంటాం. అత్యవ‌స‌ర ప‌రిస్థితుల్లో మృతుల కుటుంబ‌ స‌భ్యులే నిర్ణయం తీసుకునేలా చూస్తాం. అన్ని ఆస్పత్రుల్లో ప్రైవేట్ అంబులెన్సుల‌ను నియంత్రిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రమేయం చూపుతున్న ప్రైవేట్ అంబులెన్సుల య‌జ‌మానులు, డ్రైవ‌ర్లపై చ‌ర్యలు తీసుకోవాల‌ని ఉన్నతాధికారుల‌ను ఆదేశించాం." అని మంత్రి విడదల రజిని అన్నారు. 


అసలేం జరిగిందంటే? 


తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో అమానవీయ ఘటన జరిగింది. రుయా ఆస్పత్రిలో అనారోగ్య కారణాలతో చనిపోయిన ఓ బాలుడి మృతదేహాన్ని తరలించే విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో అక్కడ ప్రైవేట్ అంబులెన్స్ ల దందా ఏ స్థాయిలో ఉందో బయటికి వచ్చింది. ఆస్పత్రిలో ఓ బాలుడు చనిపోగా మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించేందుకు ఆస్పత్రి అంబులెన్స్ వర్గాలు అస్సలు ఒప్పుకోలేదు. ఒక శవం అందులోనూ చిన్న పిల్లాడి మృతదేహం విషయంలో ఇలా అంబులెన్స్ సిబ్బంది గొడవ పడడం ఇప్పుడు సంచలనంగా మారింది.


వివరాల్లోకి వెళితే తిరుపతి రుయా ఆస్పత్రిలో (Ruia Hospital)లో చికిత్స పొందుతూ ఓ బాలుడు సోమవారం మృతి చెందాడు. అతనికి కిడ్నీల సమస్యతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు ఓ అంబులెన్స్ ను రాజంపేటలో మాట్లాడి రుయాకు పంపించారు. ఆ అంబులెన్స్‌లో బాలుడి శవాన్ని ఎక్కించే ప్రయత్నం చేయగా, రుయా ఆస్పత్రి అంబులెన్స్‌ డ్రైవర్లు అందుకు ఒప్పుకోలేదు. తమ అంబులెన్స్‌లోనే తరలించాలని పట్టుపట్టారు. బయటి అంబులెన్స్‌ల వారు రావొద్దని వాగ్వాదానికి దిగారు. ఇలా ఇరు వర్గాలు గొడవ పడడంతో ఇక చేసేది ఏమీ లేక బాలుడి మృత దేహాన్ని తండ్రి తన బైక్‌పై  స్వగ్రామానికి తీసుకెళ్లాడు. బైక్ పై 90 కిలోమీటర్లు ప్రయాణించి అన్నమయ్య జిల్లా చిట్వేలుకు శవాన్ని తీసుకెళ్లారు.