Tirupati Job Mela : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయ్యిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇవాళ తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చదువుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం వైసీపీ జాబ్ మేళా నిర్వహించామన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా మంది ఈ జాబ్ మేళాలో యువతి, యువకులు పాల్గొన్నారని చెప్పారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటిలో రెండో రోజు నిర్వహించిన జాబ్ మేళాలలో టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పాలిటెక్నిక్ విద్యార్థులు 4,774 మంది పాల్గొన్నారన్నారు. అందులో 1,792 మంది విద్యార్థులకు అవకాశం దక్కిందన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏకు సంబంధించి 2732 మంది హాజరు కాగా అందులో 341 మంది ఎంపికయ్యారని తెలిపారు. తిరుపతిలో వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా దిగ్విజయంగా ముగిసిందన్నారు. రెండు రోజుల జాబ్ మేళాలో దాదాపు 25 వేల మంది ఉద్యోగార్థులు హాజరయ్యారన్నారు. 7,537 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన వివిధ కంపెనీల యాజమాన్యాలకు, హెచ్ఆర్ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతాభినందనలు తెలిపారు. 






జాబ్ మేళాలో ఏ స్వార్థం లేదు 


బీఈ, బీటెక్, యంటెక్, ఎంసీఏ, ఎంబీఏ అర్హత కలిగిన 2370 మంది హాజరు కాగా 621 మంది సెలెక్ట్ అయ్యారని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. నిన్న ఈరోజు మొత్తం కలిపి 25 వేల మంది హాజరు కాగా 7,537 మందిని ఎంపిక చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జాబ్ మేళాకు సంబంధించి సహకరించిన ప్రతి ఒక్క అధికారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క ఉత్తరాంధ్ర మాత్రమే కాదు కొత్తగా ఏర్పడ్డ 26 జిల్లాలోనూ పర్యటిస్తానని, ప్రతిపక్షాలు విమర్శించేలా వైసీపీ జాబ్ మేళాలో ఎలాంటి స్వార్ధం లేదని తెలియజేశారు. 


ప్రైవేట్ ఉద్యోగమే మేలు 


సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ఏదైతే హామీ ఇచ్చారో అందులో భాగంగా 6 లక్షల మంది ఉద్యోగస్తులను ప్రభుత్వంలో విలీనం చేసామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కించపరచాలని ఈ మాట అనడం లేదని, ప్రభుత్వ ఉద్యోగం కన్నా ప్రైవేటు ఉద్యోగం చాలా ఉపయోగంగా ఉంటుందని, పని చేసే వాళ్లకు ప్రైవేటు కంపెనీల్లో ఉన్న ఎదుగుదల ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండదన్నారు.. తన లాంటి వాళ్లు ఉద్యోగం చెయ్యాలి అనుకుంటే ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తామన్నారు. ఇప్పుడు ఉద్యోగం పొందిన వాళ్లకు 13 వేల నుంచి 75 వేల రూపాయల  వరకు జీతం ఉంటుందని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.