TTD Board Meeting : టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు పాలక మండలి సమావేశం శనివారం నిర్వహించారు. 252 అజెండాలతో పాలక మండలి సమావేశం జరిగింది. బ్రహ్మోత్సవాలు, సర్వదర్శనం క్యూలైన్స్ నిర్మాణంపై తీర్మానం, వకుళమాత ఆలయాన్ని టీటీడీ పరిధిలోనికి తీసుకురావాలన్న నిర్ణయం పాటు పలు కీలక అంశాలపై టీటీడీ బోర్డు చర్చించింది.  టీటీడీకి సంబంధించిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ 960 ఆస్తులను రూ.85,705 కోట్లుగా నిర్థారించారు.  12 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల‌ కొనుగోలుకు సాధికారిక సంస్థతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ వారిని చైతన్య పరచడానికి చర్యలు చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. తిరుమల గోవర్ధన సత్రం వెనుక పీఏసీ-5 నిర్మాణానికి రూ.95 కోట్లతో టెండర్లు పిలవాలని టీటీడీ బోర్డు సభ్యులు నిర్ణయించారు. 


నిధుల కేటాయింపులు 


నందకం అతిథి గృహం పునరుద్ధరణకు 2.45 కోట్లు కేటాయింపు, సామాన్య భక్తులకు కేటాయించే గదుల అభివృద్ధికి రూ.7.20 కోట్లు, నెల్లూరు శివార్లలో ఉన్న రెండు ఎకరాలలో ఆలయం, కళ్యాణ మండపం నిర్మాణానికి రూ. 9 కోట్లు, తిరుపతి ఆర్ట్స్ కాలేజీ అభివృద్ధికి రూ.6.30 లక్షలు టీటీడీ కేటాయించింది. అర్హులైన టీటీడీ ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం రూ.60 కోట్లు చెల్లించి 300 ఎకరాలు సేకరించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  రూ.25 కోట్లతో ఇంకో 129 ఎకరాల‌ కొనుగోలుపై చర్చించామన్నారు. తిరుపతిలో టైం స్లాట్ టోకెన్లు ఇవ్వడానికి నిర్ణయించామన్నారు.  వీఐపీ బ్రేక్ దర్శనాలు సమయాల్లో మార్పు చేయాలని టీటీడీ నిర్ణయించింది.  


టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు 


"టీటీడీ ఆస్తులు రూ. 85 వేల 705 కోట్లు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల పంటలను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. తిరుమలలో సామన్య భక్తులకు వసతి సదుపాయం పెంపుపై నిర్ణయం తీసుకున్నాం. గోవర్థన సత్రాల వెనుక భాగంలో 95 కోట్లతో పీఏసీ-5 నిర్మించాలని బోర్డు నిర్ణయించింది. వకూళమాత ఆలయం నుంచి జూపార్క్ వరకు రూ.30 కోట్లతో కనెక్టివిటీ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలోని గదుల్లో గీజర్ లు ఏర్పాటుకు రూ 7 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేసేందుకు చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో క్లాస్ రూమ్స్, హాస్టల్ అభివృద్ధికి రూ.6 కోట్లు 20 లక్షల నిధులు మంజూరు చేస్తాం. టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం 300 ఎకరాలు ప్రభుత్వం నుంచి ఇదివరకే కొనుగోలు చేశాం.  భవిష్యత్తు అవసరాల కోసం రూ.25 కోట్లతో మరో 130 ఎకరాలు కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయించాం.  టైం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పునరుద్ధరణ చేసి పెరటాసి మాసం అనంతరం తిరుపతిలో భక్తులకు సర్వదర్శనం టోకన్లు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం." -వైవీ సుబ్బారెడ్డి  


ఉదయం 10 గంటల తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనాలు 


"ఎలాంటి టోకెన్లు, టిక్కెట్లు లేక పోయినా భక్తులను సర్వదర్శనం అనుమతించే విధానం యధావిధిగా కొనసాగుతుంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేయాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటల తరువాత వీఐపీ బ్రేక్  దర్శనాలు ప్రారంభించాలని యోచిస్తున్నాం. పూర్తి స్థాయిలో బ్రేక్ దర్శనాలపై ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాత అమలు చేస్తాం. వసతి కేటాయింపు ప్రక్రియను పూర్తిగా తిరుపతి నగరానికి మార్పు చేయాలని యోచనలో ఉన్నాం.  బ్రహ్మోత్సవాల అనంతరం ప్రయోగాత్మక పరిశీలన అనంతరం గదులు కరెంట్ బుకింగ్ విధానం తిరుపతికి తరలించాలని నిర్ణయం తీసుకుంటాం. "-టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి