India Pak At UNGA:
ఉగ్రవాదంపై దృష్టి పెట్టండి: భారత దౌత్యవేత్త
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA)వేదికగా పాకిస్థాన్ మరోసారి భారత్‌పై విషం చిమ్మేందుకు ప్రయత్నాలు చేసింది. దీన్ని భారత్ చాలా గట్టిగా తిప్పికొట్టింది. భారత్‌లోని మైనార్టీల గురించి ప్రస్తావించారు పాకిస్థాన్ పీఎం షెజబాజ్ షరీఫ్. ఇదే సమయంలో కశ్మీర్ విషయంపైనా మాట్లాడారు. ఆరోపణలు చేసే ముందు ఓ సారి ఆలోచించాలని భారత దౌత్యవేత్త మిజిటో వింటో గట్టిగా బదులిచ్చారు. జమ్ము, కశ్మీర్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయటం మానేసి...పాకిస్థాన్‌లోని ఉగ్రవాదాన్ని అణిచివేయటంపై దృష్టి పెట్టాలని అన్నారు. "పాక్ పీఎం యూఎన్‌జీఏ అసెంబ్లీని వేదికగా మార్చుకుని భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేశారు. భారత్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్న విద్వేషాన్ని పాకిస్థాన్‌లో పెంచేందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా దీన్ని అంగీకరించవు" అని మిజిటో వింటో అన్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి ప్రభుత్వం తరపున సహకారం అందుతోందంటూ విమర్శించారు. పొరుగు దేశాలతో భారత్ శాంతి కోరుకుంటుందని, ముంబయి ఉగ్రదాడులు సహా మరి కొన్ని దారుణాలకు పాల్పడే వారికి భారత్ ఆశ్రయం కల్పించదని పాక్‌కు చురకలు అంటించారు. మైనార్టీలపై హింస గురించి మాట్లాడుతూ..పాకిస్థాన్‌లో జరుగుతున్న ఘటనలను ప్రస్తావించారు.
క్రాస్ బార్డర్ టెర్రరిజం
పాక్‌లో హిందు, సిక్, క్రిస్టియన్ మతాలకు చెందిన అమ్మాయిలను బలవంతంగా పాకిస్థానీలుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాథమిక హక్కుల్ని కాల రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దేశం...భారత్‌పై విమర్శలు చేయటమేంటని ప్రశ్నించారు. పొరుగు దేశాలతో సరిహద్దు తగాదాలు పెట్టుకునే పాక్ ఇలా మాట్లాడటం సరి కాదని తేల్చి చెప్పారు. భారత్‌లో శాంతి మాత్రమే కోరుకుంటారని, అందుకు తగ్గట్టుగానే సరిహద్దు భద్రతను పెంచుతున్నామని చెప్పారు. అయితే...పాకిస్థాన్ క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఆపేస్తే...ఇంకా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకు ముందు పాక్ పీఎం భారత్‌పై కొన్ని ఆరోపణలు చేశారు. కశ్మీర్‌ను హిందూ మెజార్టీ ప్రాంతంగా మార్చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు దీనికి కౌంటర్‌గానే మిటిజో వింటో గట్టి సమాధానమిచ్చారు.
Also Read: Dussehra 2022: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారం రోజు ఏ నైవేద్యం సమర్పించాలి!
Also Read: Roger Federer Farewell: చివరి మ్యాచ్ ఆడేసిన ఫెదరర్ - కన్నీళ్లతో వీడ్కోలు పలికిన నాదల్ Viral Video