Telangana EAMCET Ranker Dies: లోన్ ఆప్ బెదిరింపులు ఎంసెట్ ర్యాంకర్ ప్రాణాలు తీశాయి. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న విద్యార్థిని సైతం లోన్ యాప్ వేధింపులు వదిలిపెట్టలేదు. భయాందోళనతో ఎంసెట్ ర్యాంకర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకుడు కష్టపడి చదివి ఎంసెట్లో రెండు వేల ర్యాంకు సాధించాడు. అయితే రుణ యాప్ వల కు చిక్కి చివరికి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో జరిగింది. కరీంనగర్ కి చెందిన ముని సాయి అనే యువకుడ్ని లోన్ యాప్ బెదిరింపులు ఆత్మహత్య చేసుకునేలా చేశాయి.


కరీంనగర్ సమీపంలోని నగునూరుకు చెందిన శ్రీధర్ - పద్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ముని సాయి(19) ఉన్నారు. ఇటీవల జరిగిన ఎంసెట్ 2022 పరీక్షల్లో ముని సాయికి 2000 ర్యాంకు వచ్చింది. ఎంతో సంతోషంలో మునిగిపోయిన ఆ కుటుంబం ముని సాయి ఉన్నత చదువుల కోసం ప్లాన్ చేశారు. ముందుగా కౌన్సిలింగ్ కి హాజరు కావడానికి హైదరాబాద్ కి వచ్చి శంషాబాద్ లోని తన స్నేహితుడి గదిలో ఉంటున్నాడు. పట్టణంలోని వివిధ కాలేజీలకు సంబంధించి వివరాలు సేకరిస్తూ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నాడు. కౌన్సిలింగ్ కాగానే పూర్తిగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచన చేశాడు. 
నాలుగు నెలల కిందట ఎలా ట్రాప్ లో పడ్డాడో ఏమో గాని లోన్ ఆప్ (Loan App)లకు సంబంధించి మెసేజ్ రావడంతో వాటి నుండి లోన్ కోసం అప్లై చేశాడు. కేవలం పదివేల రూపాయల లోన్ ఎం-పాకెట్, ధని యాప్ ల ద్వారా తీసుకున్నాడు. అయితే E యాప్ నిర్వాహకులు కాల్ సెంటర్ నుండి వరుసగా ఫోన్ చేస్తూ బెదిరించడంతో ఇప్పటికీ దాదాపు 45 వేల రూపాయల వరకు తిరిగి చెల్లించాడు ముని సాయి. అంతటితో ఆగని యాప్స్ సిబ్బంది మరో 15000 రూపాయలు కట్టాలంటూ పరుషమైన పదజాలంతో ముని సాయిని బెదిరించారు. అంతేకాకుండా తనకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లకు సైతం తను చీటర్ అంటూ ఫొటోలు పెడతామని బెదిరించసాగారు. 
నిజంగానే పరిస్థితి అంతవరకు వెళుతుందని భయపడ్డ ఎంసెట్ ర్యాంకర్ ముని సాయి ఈనెల 20వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతడ్ని వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్న ముని సాయి శుక్రవారం రోజు మృతి చెందాడు. ఒకవైపు దాదాపుగా 50,000 కట్టిన మరోవైపు ముని సాయి ట్రీట్మెంట్ కోసం మూడు లక్షలు ఖర్చు చేశారు. లోన్ యాప్ వేధింపుల కారణంగా ఓవైపు లక్షల డబ్బుు ఖర్చు చేసినా, అన్నదాత కుమారుడి జీవితం అర్దంతరంగా ముగిసినట్లయింది. 
చిన్నప్పటినుండి కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించినప్పటికీ లోన్ యాప్ ల వలలో చిక్కి ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీరుగా రోదిస్తున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా అనేకమంది ఈ యాప్ లలో చిక్కి ప్రాణాలు కోల్పోతున్నా ఇలాంటి విషాదకర సంఘటనలు ఆగడం లేదు. అప్రమత్తతే శ్రీరామరక్ష అని, తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు అని చెప్పినా, పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించవచ్చునంటూ ఎవరూ మాయ మాటలు చెప్పినా వినకూడదని, ముఖ్యంగా లింక్స్ ఓపెన్ చేయడం, స్కాన్ చేయడం, ఓటీపీలు చెప్పడం లాంటి పనులు అసలు చేయవద్దునని పోలీసులు, అధికారులు, సైబర్ నిపుణులు చెబుతున్నారు.