Tirupati Ruia Hospital : తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ హృదయ విదారక ఘటన ఏపీలో వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల స్థితికి తెలియజేస్తున్నాయని అన్నారు. రుయా ఆసుపత్రిలో మృతి చెందిన బాలుడుని తన తండ్రి బండిపై 90 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. ప్రైవేట్ అంబులెన్స్ వాళ్లు అడిగిన నగదు ఇచ్చుకోలేక ఇలా చేశారు. ఈ ఘటనతో తన గుండె తరుక్కు పోయిందని చంద్రబాబు అన్నారు. అంబులెన్స్ వాహనం కోసం ఎంతమందిని ఆర్జించిన ఫలితం లేకపోయిందని, ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ వ్యవహార శైలి అమానుషంగా ఉందన్నారు. పేదరికంలో మగ్గుతున్న ఆ తండ్రికి తన బిడ్డను బైక్‌పై 90 కిలోమీటర్లు తీసుకెళ్లడం తప్ప మరో మార్గం లేకపోయిందని చంద్రబాబు తెలిపారు. ఈ హృదయ విదారక ఘటన సీఎం జగన్ పరిపాలనలో కుప్పకూలుతున్న ఆరోగ్య రంగం మౌలిక సదుపాయాల స్థితికి ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చంద్రబాబు ట్వీట్ చేశారు.
విచారణ చేపట్టాలని కలెక్టర్ ను కోరాం
రుయా ఆసుపత్రి ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. పదేళ్ల బాలుడి మృతిదేహాన్ని తరలించేందుకు అధిక నగదు డిమాండ్ చేసిన ప్రైవేట్ అంబులెన్స్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరామన్నారు. రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్డీవో కనక నరసరెడ్డిని విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఎటువంటి అన్యాయం జరిగినా ఉపేక్షించేది లేదని, రుయా ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తిరుపతి ఎంపీ గురుమూర్తి వెల్లడించారు.
ఆసుపత్రిలోకి ప్రైవేట్ అంబులెన్స్ కు అనుమతి లేదు
రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.భారతి మాట్లాడుతూ ... ఈ నెల 24వ తేదీ విషమ పరిస్థితుల్లో రాజంపేట చిట్వేలుకు చెందిన 9 ఏళ్ల అబ్బాయిని రుయా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ముందు నుంచే చికిత్స తీసుకుంటున్న బాలుడికి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం, కిడ్నీల వద్ద చీము పట్టిందన్నారు. 24 గంటల పాటు నయం చేయడానికి వైద్యులు శ్రమించారు. కానీ బాబు చనిపోయాడని డా.భారతి తెలిపారు. ప్రైవేట్ అంబులెన్స్ లు ఆసుపత్రిలోకి అనుమతి లేదు. వస్తే అడ్డుకోకూడదని ఆదేశించామన్నారు. బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ అధిత మొత్తం డిమాండ్ చేసిన ఘటపై విచారణ చేపడుతున్నామన్నారు.