ఎస్సై ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్న విజయ భారతి అనే యువతికి ఓ యువకుడు పరిచయమయ్యాడు. ప్రేమిస్తానని చెప్పాడు. ఆమె కూడా నమ్మంది. కష్టాల్లో ఉన్నానని కలరింగ్ ఇచ్చాడు. వాటికి కరిగిపోయింది. పెళ్లి చేసుకోబోయేవాడు కష్టాల్లో ఉన్నాడని లక్షలు లక్షలు ఇచ్చింది. చివరకు వాడు హ్యాండ్ ఇచ్చాడు. ఏం చేయాలో అర్థం కాక డిప్రషన్‌లోకి వెళ్లిపోయింది ఆ యువతి.
కొన్ని రోజులకు ఆ మానసిక సంఘర్షణ నుంచి కోలుకుంది. రీబూట్ అయింది. ఎస్సై జాబ్ కొట్టింది. కష్టాల అధిగమించిన యువతిగా ఆదర్శంగా మారింది. సిద్దిపేట జిల్లాలో అప్పట్లో అంటే కరోనా కంటే ముందు విజయ భారతి పేరు మారుమోగింది. చాలా మంది సన్మానాలు చేశారు.
కట్ చేస్తే 2022 ఏప్రిల్ 25 నాడు విజయభారతిని పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఆ అరెస్టుకు కారణాలు చెబుతుంటే ఒక్కొక్కరి ఫీజులు అవుట్ అయ్యాయి. ఆమె ముసుగు తీసేసిన పోలీసులు వాస్తవ రూపాన్ని ప్రజల ముందు ఉంచారు. అసలు ఆమె ఎస్సై కాదంటూ బాంబ్ పేల్చారు.
2019లో ఆమెకు జాబ్ రాలేదని.. నకిలీ డాక్యుమెంట్స్‌తో మోసం చేస్తూ వచ్చిందని ట్విస్ట్ ఇచ్చారు. అంతే కాదు ఆ డాక్యుమెంట్స్‌తో చాలా మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. లక్షలు లక్షలు దోచుకున్నట్టు రివీల్ చేశారు పోలీసులు.
2018లో ప్రియుడు మోసం చేయడంతో కుంగిపోయిన విజయ భారతి ఎస్సై ఉద్యోగానికి సెలెక్ట్ కాలేకపోయింది. అప్పుడే తనకున్న నాలెడ్జ్‌తో డూప్లికేట్ డాక్యుమెంట్స్ రెడీ చేసింది. తనకు ఎస్సై పోస్టు వచ్చిందని చెబుతూ అందర్నీ నమ్మించింది. సన్మానాలు అందుకుంది. సోషల్ మీడియాలో ఆమెను ప్రమోట్ చేసుకుంది.
ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయని విస్తృతంగా ప్రచారం చేసి నిరుద్యోగులకు గ్యాలం వేసింది. ఇదిగో నోటఫికేషన్ అదిగో పోస్టు అంటూ ఊరించి వసూళ్ల దందా మొదలెట్టింది. తను ఎస్సై నంటూ తనకు తెలిసిన వాళ్ల ద్వారా పోస్టింగ్స్ వేయిస్తానని నమ్మించింది. ఇది నమ్మిన వాళ్లు లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు సమర్పించుకున్నారు.
పోలీసు శాఖలో, సచివాలయంలో ఉద్యోగాలు ఉన్నాయని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలానికి చెందిన యువకుడి నుంచి పది లక్షలు కొట్టేసిందీ విజయ భారతి. డబ్బులు అందిన తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోయేసరికి ఆ యువకుడికి అనుమానం వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. తాను మోసపోయానని తెలుసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇలాంటి మాయమాటలతోనే హైదరాబాద్‌లోనే ఉంటూ యాభై మంది నుంచి 70 లక్షలు వసూలు చేసిందీ కిలేడీ. తను ఎస్సైనని చెప్పి వరంగల్‌కు చెందిన ఓ యువకుడ్ని పెళ్లి చేసుకుంది. వాళ్లకు ఇప్పుడు ఓ బాబు ఉన్నాడు. బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులకు విజయ భారతి ఆచూకీ తెలుసుకోవడం సవాల్‌గా మారింది. తనకున్న సాంకేతికతతో పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టింది.
పోలీసులకు తను ఉన్న టవర్ లొకేష్ దొరక్కుండా జాగ్రత్తపడింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన పోలీసులు ఆమె పట్టుకోలేకపోయారు. చివరకు భర్త సాయంతో విజయభారతిని అరెస్టు చేశారు. భర్త సెల్ నుంచి ఫోన్ చేయించి లొకేషన్ తెలుసుకున్నారు. హుస్నాబాద్‌లో ఉన్నట్టు చెప్పడంతో వెంటనే వెళ్లి అరెస్టు చేశారు.