ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (ఏప్రిల్ 26) హైదరాబాద్‌లో 3 చోట్ల టిమ్స్ ఆస్పత్రులకు శంకుస్థాపనలు చేయనున్న వేళ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. నేడు సీఎం కేసీఆర్ గడ్డి అన్నారం, సనత్ నగర్, అల్వాల్ ప్రాంతాల్లో మూడు చోట్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అల్వాల్ రైతు బజార్ ఎదురుగా ఉన్న స్థలంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అందుకోసం మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో తిరుమలగిరి చౌరస్తా - బొల్లారం చెక్‌పోస్టు మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ బహిరంగ సభలో కూడా పాల్గొంటారు కాబట్టి, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనదారులు ఈ మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లడం మేలని పోలీసులు సూచిస్తున్నారు.
కరీంనగర్ హైవేకు రాకపోకలు సాగించే వారు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ సోమవారం చెప్పారు. నిర్ణీత సమయంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో జరుగుతుందని వివరించారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కరీంనగర్ హైవే మధ్య ఉన్న తివోలీ ఎక్స్‌రోడ్స్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తెలంగాణ తల్లి విగ్రహాల కేంద్రంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తామని అన్నారు. కరీంనగర్ హైవే నుంచి హైదరాబాద్ సిటీలోకి వచ్చే మార్గంలో షామీర్ పేట ఓఆర్‌ఆర్, బిట్స్ జంక్షన్, తూముకుంట ఎన్టీఆర్ విగ్రహం, బొల్లారం చెక్‌పోస్టు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనదారులు వీటిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
తూముకుంట ఎన్టీఆర్ విగ్రహం నుంచి దేవరయంజాల్ వైపు, మెడికవర్ ఆసుపత్రి నుంచి కొంపల్లి, సుచిత్ర బోయినపల్లి వైపు వెళ్లాలి. బొల్లారం చెక్‌పోస్టు వద్ద ఎడమ నుంచి కౌకూరు వైపు, యాప్రాల్ నుంచి లోతుకుంట, లాల్‌బజార్, తిరుమలగిరి వైపు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.
రూ.2,679 కోట్లతో 3 హాస్పిటళ్లు
ఈ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.2,679 కోట్లు కేటాయించింది. ఈ మేరకు గురువారం జీవో జారీ చేశారు. ఎల్బీ నగర్ గడ్డి అన్నారంలో నిర్మించతలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రూ.900 కోట్లు, సనత్ నగర్‌లో నిర్మించే ఆస్పత్రికి రూ.882 కోట్లు, అల్వాల్ టిమ్స్‌కు రూ.897 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రి ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది నగరానికి ఒకవైపు ఉండగా, మిగతా మూడు వైపులా ఇలాంటి టిమ్స్ ఆస్పత్రులనే నిర్మిస్తామని కేసీఆర్ అప్పుడే ప్రకటించారు. ముఖ్యంగా అల్వాల్ - ఓఆర్‌ఆర్ మధ్య నిర్మించే సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల వల్ల సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల ప్రజలు ట్రాఫిక్ సమస్య లేకుండా వైద్య సేవల కోసం రావచ్చు.