Yarlagadda Lakshmi Prasad's comment on YCP : రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్య లేనని విశ్వ హిందీ పరిషత్ చైర్మన్ పద్మ విభూషణ్ ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గల హిందీ భవన్ లో శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో పని చేసిన ఆయన ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఆయా పదవులకు రాజీనామా చేశారు. అనంతరం వైసిపికి దూరంగా ఉంటూ వచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి స్వయం కృతాపరాధం అన్న రీతిలో యార్లగడ్డ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి పేరు మార్చడాన్ని తాను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వివరించారు. అయినప్పటికీ పాలకులు తన మాట వినలేదని వెల్లడించారు. అందుకే తాను పదవులకు రాజీనామా చేసినట్లు వివరించారు. వైయస్సార్ వైద్య విశ్వవిద్యాలయానికి మళ్లీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును పునరుద్ధరించినందుకు సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కు ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. మంత్రివర్గం ఏర్పాటైన వెంటనే సత్య కుమార్ గారికి తాను స్వయంగా విశ్వవిద్యాలయం పేరు మార్చాలని కోరానని, వెంటనే స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హిందీ భాషను ఐక్యరాజ్యసమితి కూడా అధికార భాషగా గుర్తించాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాషకు గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ హిందీ భాష అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా కృషి చేస్తున్నారని కొనియాడారు.


దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు హిందీ నేర్చుకోవాలని, చట్టాలన్నీ భవిష్యత్తులో హిందీలో వస్తాయని వెల్లడించారు. కాబట్టి విద్యార్థులంతా ఇప్పటి నుంచే హిందీ భాష నేర్చుకోవాలని యార్లగడ్డ కోరారు. హిందీ భాషకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చే తీసుకువచ్చేందుకు అనుగుణంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో ఆరు భాషలు మాత్రమే అధికారం భాషలుగా కొనసాగుతున్నాయన్నారు. హిందీని కూడా అధికార భాషగా చేయాలన్నది వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచి డిమాండ్ ఉందన్నారు.  ఐక్యరాజ్యసమితిలో ప్రధాని వాజ్ పేయి, పీవీ నరసింహారావు కూడా హిందీలోనే మాట్లాడారన్నారు.


ఈ మేరకు గుర్తింపు రావాలంటే ఐక్యరాజ్యసమితిలోని మూడొంతులు దేశాలు మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణమైన మద్దతును పొందే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. అయితే తర్జుమా సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణమైన కార్యక్రమాలను చేపడుతున్నట్లు యార్లగడ్డ వివరించారు. భారతీయులు ఎక్కువగా ఉన్న దేశాల్లో, రాజకీయంగా నిర్ణాయక శక్తిగా భారతీయులు ఉన్న దేశాల్లో హిందీ భాషను అధికార భాషగా పెట్టే తీర్మానానికి మద్దతు తెలిపేలా డిమాండ్ చేయాలని కోరారు. 


అందుకే ఆ పదవులకు రాజీనామా 


ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి పేరు మార్చిన విషయం తెలిసిన వెంటనే పలు పదవులకు రాజీనామా చేసినట్లు యార్లగడ్డ వివరించారు. అధికార భాషా సంఘం చైర్మన్, హిందీ అకాడమీ చైర్మన్ పదవులకు రాజీనామా చేశానని, క్యాబినెట్ ర్యాంకుతో కూడిన మూడు లక్షల జీతాలు కూడా వదులుకున్నట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ పేరు సాగించిన విషయం రాత్రి 8 గంటలకు తెలిస్తే.. మరుసటి రోజు తెల్లవారి ఉదయం 8 గంటలకు పదవులకు రాజీనామా చేశానన్నారు.