Case On Kandukur Issue :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ర్యాలీ సందర్భంగా కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. కందుకూరు పోలీస్ స్టేషన్ లో 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. 


బాధిత కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ 


నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు   పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ... మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల పిల్లలను చదివించే బాధ్యత టీడీపీది అని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ, టీడీపీ నేతల తరపున రూ.24లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఇరుకు రోడ్లలో సభలు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇన్నేళ్లలో ఎన్నో సభలు పెట్టామని చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలు సభలు పెట్టే చోటే తాము పెట్టామన్నారు. తమపై విమర్శలు చేసినవారి విజ్ఞతకే అన్నీ వదిలిపెడుతున్నా అని చంద్రబాబు పేర్కొన్నారు. 


ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 24 లక్షల సాయం !
 
కందుకూరు  ప్రమాద మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆర్థిక సాయం ప్రకటించారు. టీడీపీ నుంచి, పార్టీ నేతల నుంచి ఒక్కొక్క కుటుంబానికి రూ.24 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. తెలుగు దేశం పార్టీ ఆర్థిక సాయం రూ.15లక్షలు, ఇంటూరి నాగేశ్వర్ రావు రూ. 1 లక్ష, ఇంటూరి రాజేష్ రూ.1 లక్ష, శిష్ట్లా లోహిత్ రూ. 1 లక్ష, బేబీ నాయన రూ.50 వేలు, కేశినేని చిన్ని రూ.50 వేలు, కంచర్ల సుధాకర్ రూ.2 లక్షలు, కంచర్ల శ్రీకాంత్ రూ. 1 లక్ష, అబ్దుల్ అజీజ్ రూ.50వేలు, పోతుల రామారావు రూ.50వేలు, పొడపాటి సుధాకర్ రూ.50 వేలు, వెనిగండ్ల రాము రూ. 50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.


సభ ప్రారంభమైన వెంటనే తోపులాట ! 


బుధవారం రాత్రి 7.30 గంటలకు ఎన్టీఆర్‌ కూడలిలో సభ ప్రారంభమైన 2 నిమిషాలకే చంద్రబాబు రోడ్డు షోలో ప్రసంగించే వాహనం ఎదురుగా తోపులాట ప్రారంభమైంది. దీంతో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు అక్కడ కాలువ ఉంది జాగ్రత్త! అని పదేపదే హెచ్చరిక చేశారు. ఇంతలో కొందరు యువకులు అక్కడే ఉన్న రేకుల పందిరి ఎక్కే ప్రయత్నం చేయడంతో చంద్రబాబు స్వయంగా ‘‘అది ఎక్కకండి ప్రమాదం.. అది ఎక్కకండి. ప్రమాదం’’ అని హెచ్చరిస్తూ తన ప్రసంగాన్ని నిలిపి వేశారు. అయితే అప్పటికే తొక్కిసలాట ప్రారంభమవడంతో అనేక మంది కిందపడిపోగా మిగిలిన వారు బతుకు జీవుడా అంటూ వాళ్లని తొక్కుకుంటూ వెళ్లిపోవడంతో చాలా మంది సొమ్మసిల్లిపడిపోయారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, ఎనిమిది మంది మృతి చెందారు.