ఈమధ్య వైసీపీ నేతలు నిజాలు మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై సంచనల వ్యాఖ్యలు మర్చిపోకముందే..లేటెస్ట్ గా మంత్రి విశ్వరూప్ జగన్ ప్రభుత్వాన్ని చురకలు అంటించారు.


అమలాపురం అల్లర్ల కేసులో అమాయకులు అరెస్ట్: మంత్రి విశ్వరూప్


అమలాపురం అల్లర్ల కేసుల్లో కొందరు అమాయకులు అరెస్ట్ అయ్యారని స్వయానా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్‌ బాంబ్ పేల్చారు. ప్రభుత్వం అసలు దోషులను పట్టుకుందని అంటూనే..అమాయకులు బలయ్యారని సాక్షాత్తు మంత్రి విశ్వరూప్ కామెంట్ చేయడం వైసీపీలో దుమారం రేపుతోంది. తమకు ఎవరిపైనా కక్షలు లేవని, అయితే కొందరు అమాయకులు అరెస్ట్‌ అయ్యారని, వారిని వదలిపెట్టాలని కోరానని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రికి కూడా చెప్పానన్నారు. తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తనకు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కు నష్టం జరిగిందని, దోషులను దేవుడే శిక్షిస్తాడన్నారు. ఆ సంఘటన దురదృష్టకర సంఘటన గానే భావిస్తున్నానన్నారు. 


2024ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా..


వచ్చే 2024 ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని విశ్వరూప్ స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయం గురించి కూడా విశ్వరూప్‌ స్పష్టతనిచ్చారు. తన కుమారులు పోటీ చేసేందుకు పోటీపడుతున్నారన్న  ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటేనే నాయకుడిగా కాగలరని..తమ కుమారులు విషయంలోనూ ఇదే జరుగుతుందన్నారు. అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రస్తుతం కోలుకున్నానని, తనకు సహకారంగా తన కుమారులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారని మంత్రి విశ్వరూప్ తెలిపారు.  


అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు
అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందివ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి విశ్వరూప్. కుటుంబంలోనూ ప్రభుత్వ లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని.. అది ఓర్వలేని  కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు.  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గం తాడికోన గ్రామంలో మంత్రి విశ్వరూప్‌, ఆయన తనయుడు పినిపే శ్రీకాంత్‌ గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు.


మూడేళ్లైనా ప్రాజెక్టు పనులు మొదలు పెట్టామా
మాజీమంత్రి, వెంకటగిరి వైస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓట్లు అడిగే సమయంలో ప్రాజెక్టులు కడతామంటూ ప్రజల్ని నమ్మించామని సెటైర్లు వేశారు.  కానీ మూడేళ్లలో దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టలేకపోయామని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, ఇటు మంత్రి విశ్వరూప్ కామెంట్లు వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.


ఏపీ ప్రభుత్వ పాలనపై సంచలన వ్యాఖ్యలు 
మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఏపీ ప్రభుత్వ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓట్లు అడిగే సమయంలో ప్రాజెక్ట్ లు కడతామంటూ ప్రజల్ని నమ్మించామని, కానీ మూడేళ్లలో దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టలేకపోయామని చెప్పారు. పెన్షన్లకే ప్రజలు ఓట్లు వేస్తారనుకోలేమన్నారు. లే అవుట్లు అన్నారు, ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు.. కానీ ఏవీ కాలేదన్నారు. సచివాలయాల పరిధిలో నియమించిన కన్వీనర్లు, వాలంటీర్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన వాస్తవాలను కుండబద్దలు కొట్టారు. ఈ కార్యక్రమానికి ఐప్యాక్ ప్రతినిధి శబరినాథ్ రెడ్డి హాజరయ్యారు. అందరూ కలసి ఏడాదిపాటు సమన్వయంగా పనిచేయాలంటూ ఐప్యాక్ ప్రతినిధి చెప్పారని, కానీ ఇక్కడ వాస్తవం వేరు అని చెప్పారు. కనీసం మిగిలిన ఏడాదిలో అయినా పనులు చేపట్టాలని, ఇది మేం చేశాం అని చెప్పుకోడానికి మాకో అవకాశం ఇవ్వాలన్నారు.