కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ప్రత్యేక పరిశీలకుడిగా ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని.. ఆ వీడియోలను సోమవారం హైకోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని .. కౌంటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయించాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.


Also Read : చిత్తూరులోనే హీరో మొదటి ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ తయారీ


ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తూండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నామినేషన్ల దగ్గర్నుంచి పోలింగ్ వరకూ ప్రతీ చోటా వివాదాలు ఏర్పడ్డాయి. పోలింగ్ రోజు దొంగ ఓటర్లు వెల్లువలా వచ్చినా పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్‌లోనూ అక్రమాలకు పాల్పడతారన్న ఉద్దేశంతో వారు హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. 


Also Read : తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !


కుప్పం నగర పంచాయతీలో మొత్తం 25 వార్డులు ఉండగా ఒక వార్డు ఏకగ్రీవం అయింది. అక్కడ కూడా ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరింప చేశారన్న వివాదం ఉంది. ఈ తరుణంలో ఎన్నికలు ఉద్రిక్తంగా సాగడంతో ముందు జాగ్రత్తగా టీడీపీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.


Also Read : ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్


కుప్పంతో పాటు నెల్లూరు కార్పొరేషన్, మరో 11 నగర పంచాయతీలకు సోమవారం పోలింగ్ జరిగింది. వాటికి కౌంటింగ్ బుధవారం జరగనుంది. కౌంటింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని చోట్లా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో కౌంటింగ్ దగ్గర కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఈసీ పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను టీడీపీ నేతలు చేస్తూండటంతో కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


Also Read : రాజ్యసభ సభ్యుడ్ని ఎమ్మెల్సీ చేసిన కేసీఆర్ ! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ మార్క్...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి