AP Liquor Policy : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు అనేది ఓ పెద్ద రాజకీయ అంశం. మద్యాన్ని స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేసి ఎన్నికలకు వెళ్తామని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ.. సభల్లోనూ ప్రకటించారు. ఆ ప్రకారం తాము మద్యాన్ని నియంత్రిస్తున్నామని సీఎం చెబుతున్నారు. తమ విధానం ప్రకారం షాక్ కొట్టే ధరలు పెట్టామని అందుకే వినియోగం తగ్గిందని చెబుతున్నారు.
ప్రభుత్వ లెక్కల్లో భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు !
2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.31 లక్షల కేసులు కాగా 2021–22లో ఏకంగా 278.5 లక్షల కేసులకు తగ్గినట్లు ప్రభుత్వం అధికారికంగా డాటా విడుదల చేసింది. 2018–19లో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా 2021–22లో గణనీయంగా 82.6 లక్షల కేసులకు తగ్గిపోయాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే గణనీయంగా అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ ప్రకారం చూస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని అనుకోవచ్చు.
ఆదాయం మాత్రం ట్రిపుల్ !
అయితే మద్యంపై ఆదాయం మాత్రం ఊహించనంతగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. ఆరు వేల కోట్ల వరకూ ఉండే ఆదాయం.. అనూహ్యంగా పెరిగింది. 2021 – 22లో ఆదాయం రూ.25,023 కోట్లుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది దాదాపుగా మూడింతలు అధికం. మద్యం అమ్మకాలు తగ్గినా ఆదాయం ఇంత భారీగా పెరగడానికి కారణం షాక్ కొట్టే ధరలే. ధరలు షాక్ కొట్టేలా పెంచుతామని జగన్ ముందు నుంచీ చెబుతున్నారు. ధరలు పెంచితే తాగే వారు తగ్గిపోతారని ఆయన ఆలోచన. ప్రస్తుతం లిక్కర్ అమ్మకాలు తగ్గిపోవడంతో ఇది సరైన ఫార్ములా అని ప్రభుత్వం చెబుతోంది. ఆదాయానికి ఆదాయం.. మద్యం నియంత్రణ కూడా జరుగుతోందని అంచనా వేస్తున్నారు.
అక్రమ మద్యం ఏరులై పారుతోందా !?
అయితే సీఎం జగన్‌తో జరిగిన సమీక్షలో గత ఆర్నెల్లలో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తం 20,127 కేసులు నమోదైనట్లుగా పోలీసులుచెప్పారు. 16,027 మందిని అరెస్టు చేసి 1,407 వాహనాలు సీజ్ చేశారు. నాటుసారా తయారీనే వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఆరు నెలల్లోనే ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయంటే.. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మద్యం ఏపీలోకి వస్తున్నట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ధరలు షాక్ కొట్టేలా పెరిగినందున కొనలేని వారు స్గ్లింగ్ చేస్తున్న మద్యం లేదా నాటు సారాకు అలవాటు పడుతున్నారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా .. మద్యం అమ్మకాలు బాటిళ్ల వారీగా తగ్గాయ కానీ తాగే మనుషులు తగ్గలేదని వారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారని అంటున్నారు. గతంలో తక్కువకు వస్తుందని శానిటైజర్లు తాగి కొంత మంది చనిపోయిన విషయాల్ని గుర్తు చేస్తున్నారు.
మద్యం విధానం ఏపీ ప్రభుత్వానికి మైనస్సే !
మద్యం ధరలు మందు బాబుల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయన్న విమర్శలు ఓ వైపు వస్తున్నాయి. మరో వైపు మద్యం మాన్పించడానికే అలా చేస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అలా లేవు. బార్ల లైసెన్సులు మూడేళ్లకు ఇస్తున్నారు. రకరకాల పేర్లు పెట్టి.. మద్యం దుకాణాలు పెంచుతున్నారు. తగ్గించాల్సి ఉన్నా తగ్గించడం లేదు. అందుకే మద్యం విధానంపై ఎలాంటి చర్చ జరిగినా ఏపీ ప్రభుత్వానికి రిమార్కులే పడుతున్నాయి.