IT Refund Delay: ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసి చాలా రోజులైంది. ఐటీఆర్ (ITR)ద్వారా ఎక్కువ పన్ను చెల్లించినవారికి ఇప్పటికే రీఫండ్ వచ్చేస్తోంది. కొందరికి ఎదురు చూపులు తప్పడం లేదు. ఒకవేళ మీరూ ఈ జాబితాలో ఉంటే కంగారు పడకండి. కారణాలేంటో తెలుసుకోండి.
ఐటీ రీఫండ్ (IT Refund) రాకపోతే మొదట ఆన్‌లైన్‌లో మీ ఐటీఆర్ స్టేటస్ తెలుసుకోండి. incometaxindiaefiling.gov.in లేదా tin.tin.nsdl.com, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ వెబ్‌సైట్లలో మీ వివరాలను తనిఖీ చేయండి. సాధారణంగా ఐటీఆర్ దాఖలు చేసిన కొన్ని వారాల్లోనే అసెస్‌మెంట్ బ్యాంకు ఖాతాలో రీఫండ్ డబ్బులు జమ అవుతాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆలస్యం అవుతుంది.
బ్యాంకు ఖాతా తప్పులు
కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఐటీఆర్‌లో పొరపాట్లు జరుగుతుంటాయి. బ్యాంకు ఖాతా సమాచారం తప్పుగా పడొచ్చు. అందుకే ఐటీఆర్ సమర్పించే ముందే బ్యాంకు ఖాతాను వాలిడేట్ చేసుకోవాలి. లేదంటే డబ్బులు జమ అవ్వవు.
పేపర్ వర్క్ మిగిలుందా!
అదనపు పేపర్ వర్క్ మిగిలే ఉండొచ్చు. మీరు ఐటీ రీఫండ్ పొందేందుకు అర్హులేనని ధ్రువీకరించే పత్రాలు అవసరం కావొచ్చు. ఐటీఆర్ సమర్పించేటప్పుడు అవసరమైన పత్రాలు జత చేయకపోతే రీఫండ్ ఆలస్యం అవుతుంది.
తప్పుడు సమాచారం
ఐటీఆర్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినా రీఫండ్ నిలిచిపోతుంది. అందుకే పొరపాట్లకు తావులేకుండా ఐటీ రిటర్నులు దాఖలు చేయాలి. లేదంటే రీఫండ్ ప్రాసెస్ ఆగిపోతుంది. లేదా డబ్బులు తిరిగొచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
టీడీఎస్, ఐటీఆర్ మిస్‌మ్యాచ్
మీ యజమాని సమర్పించిన టీడీఎస్ రిటర్ను లేదా బ్యాంకు వంటి సంస్థలు మూలం వద్ద మినహాయించిన పన్ను వివరాల్లో తప్పులుంటే ఐటీ రీఫండ్ ఆలస్యం అవుతోంది. 26ఏఎస్ పత్రంలో పొరపాట్లూ కారణం కావొచ్చు. అలాంటప్పుడు టీడీఎస్ రిటర్ను సరిచేయాల్సిందిగా కంపెనీ మానవ వనరుల శాఖను సంప్రదించాలి.
Also Read: తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా! ఈ సింపుల్ ప్రాసెస్‌తో కన్‌ఫ్యూషన్ ఉండదు!
ఐటీ శాఖ ఆలస్యం
అనూహ్య సందర్భాల్లో ఆదాయపన్ను శాఖ నుంచీ ఆలస్యం కావొచ్చు. మీ ఐటీఆర్‌ను ప్రాసెస్ చేసేందుకు అదనపు సమయం తీసుకోవచ్చు. బ్యాంకు పరంగా సమస్య ఉండొచ్చు. అలాంటప్పుడు ఐటీ రీఫండ్ ఆలస్యం అవుతుంది.
రీఫండ్ రాకపోతే?
ఏదేమైనా ఐటీఆర్ సమర్పించాక నిర్దేశిత సమయంలో రీఫండ్ రాకపోతే మొదట ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో ధ్రువీకరించుకోవాలి. ఎందుకంటే ఈ-వెరిఫై అయ్యేంత వరకు ఐటీఆర్ దాఖలు చేసినట్టు కాదు. సాధారణంగా ఐటీఆర్ వెరిఫికేషన్ కోసం నెల రోజుల సమయం ఉంటుంది. ఆ లోగా చేసేయాలి. నెట్ బ్యాంకింగ్, బ్యాంకు ఏటీఎం, ఆధార్, బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ద్వారా ఐటీఆర్ వెరిఫై చేసుకోవచ్చు. మీ ఐటీఆర్ దాఖలు, వెరిఫికేషన్‌కు సంబంధించిన ఆదాయపన్ను శాఖ నుంచి ఏమైనా ఈ-మెయిల్స్, సందేశాలు వచ్చేయోమో చూసుకోవాలి.
Also Read: ఐటీఆర్ ఆలస్యం చేస్తే ఈ ప్రయోజనాలు నష్టపోతారు!
Also Read: మీ పీఎఫ్ వడ్డీపై పన్ను కట్టాలని తెలుసా! ఇదీ అసలు సంగతి!